వివాహాల సీజనా...? ఎన్నికల సీజనా...? బంగారం ధర పెరగటానికి కారణమేంటి??
వివాహాల సీజన్ మొదలుకావడంతో భారత్‌కి బంగారం దిగుమతులు గణనీయంగా పెరిగాయి. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఐదేళ్లలో లేనంత అత్యధిక స్థాయికి చేరుకున్నప్పటికీ దిగుమతులు ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదు. గత జనవరితో పోల్చుకుంటే ఈ సంవత్సరం జనవరి నాటి దిగుమతి దాదాపు 64 శాతం పెరిగి 46 టన్నులకు చేరుకుంది. లండన్‌లోని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కూడా ఈ ఏడాది భారత్‌లో బంగారానికి డిమాండ్ మరింత పెరగవచ్చని అంచనా వేసింది.
అయితే.. మే నెలలో ఎన్నికలు రానుండటం, ఎన్నికల సమయంలో ప్రజల చేతులలో నగదు ప్రవాహం పెరిగినా తద్వారా డిమాండ్ పెరగబోతోందని నిపుణులు భావిస్తున్నారు. దీనికి అనుగుణంగానే ప్రజలకు బడ్జెట్‌లో ప్రకటించిన కానుకల విలువ మాత్రమే దాదాపు రూ.లక్ష కోట్ల వరకు ఉంది.
డిమాండ్ పెరగడంతో ధరల పెంపు కొనసాగుతుందని కూడా నిపుణులు భావిస్తున్నారు. దీనికి తగ్గట్లే ఫిబ్రవరి 4వ తేదీన బెంచ్‌మార్క్ గోల్డ్ ఫ్యూచర్లు 33,646 కు చేరాయి. 2013 సెప్టెంబర్ తర్వాత ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.