సమయపాలనే భవిష్యత్ విజయానికి తొలిమెట్టు!

time management
PNR| Last Updated: మంగళవారం, 18 ఆగస్టు 2015 (16:19 IST)
నేటి యువత సమయపాలనపై పెద్దగా దృష్టిసారించదు. ఫలితంగా తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో పూర్తిగా విఫలమవుతూ.. తీవ్ర నిరుత్సాహానికి లోనవుతుంటారు. నిజానికి తెలివిమంతులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ప్రతి చిన్న పనినీ నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని భావిస్తుంటారు. తమ జీవిత లక్ష్యాన్ని చేరుకోవాడానికి అనువైనదేమిటో గుర్తించి దాన్ని సకాలంలో పూర్తిచేయడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటివారే సులభంగా తమ లక్ష్యాలను చేరుకుంటారని నిపుణులు అభిప్రాయపడుతన్నారు. ఈ సమయపాలనను తు.చ తప్పకుండా పాటించాలంటే కొన్ని విషయాలను విధిగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది.
 
 
మనకున్న సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి. ఉన్న సమయం అత్యంత విలువైంది అనే భావన మనస్సులో ఏర్పడాలి. అలాగే, అందరికీ ఉన్నట్టుగానే మనకూ 24 గంటల సమయమే ఉందని, ఇందులో ఏ ఒక్క నిమిషం వృధా అయినా తిరిగిరాదనే విషయాన్ని గ్రహించాల్సి ఉంటుంది. 
 
పైగా, గడియారం ముళ్లును స్లోగా తిరగమనో, ఫాస్ట్‌గా తిరగమనో ఆదేశించలేం. అయితే మనం చేయగల్గిందంతా మన చేతిలో ఉన్న కాలాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం. ఉన్న గంటలనే సరిగ్గా ప్లాన్ చేసుకొని ఒక పద్ధతి ప్రకారం చదవడం. టైమ్ మేనేజ్‌మెంట్ తెలియకపోవడం వల్లే చాలామంది వెనుకబడిపోతున్నారు. 
 
మరోవైపు కుటుంబ బాధ్యతలు, ఇంకోవైపు కెరీర్ సక్సెస్, సామాజిక బాధ్యతలు, మరింత అభివృద్ధి సాధించే క్రమంలో అధ్యయనం చేయాల్సిన ఇతర అంశాలు. ఇన్ని కార్యక్రమాలు సమన్వయపరుచుకుంటూ ఉన్న 24 గంటల సమయాన్ని తెలివిగా వెచ్చిస్తూ గడపాలి. రోజుకూ ప్రతివ్యక్తి చేతిలోనూ ఉండేది 86,400 సెకన్లు మాత్రమే. కొంతమందికి ఈకాలం అతి వేగంగా పరిగెడుతూ ఉంటుంది. మరికొంత మందికి ఇది మందకొడిగా సాగుతుంది. వారు చేసే కార్యక్రమాలను బట్టి కాలం వేగంగానో, మందకొడిగానో సాగుతుంది. 
 
జీవితంలో ఆనందాన్ని, డబ్బును సంపాదించాలంటే కాలాన్ని తెలివిగా మేనేజ్ చేసుకోవడం మినహా గత్యంతరం లేదని రెహమాన్ అనే కాగ్నిటివ్ థెరపిస్టు సూచిస్తున్నాడు. ఇందుకోసం ఆయన కొన్ని సూచనలు కూడా చేశారు. జీవిత లక్ష్యాల సాధనకే ఎక్కువ కాలాన్ని పెట్టుబడిగా పెట్టాలని, ప్రతిరోజూ రాత్రి మీ జీవిత లక్ష్యానికి సంబంధించిన పనుల్లో ఏ మేరకు మీరు పూర్తిచేయగలిగారో రాసుకోవాలని, అనుకున్నంత మేరకు కొన్ని పనులు ఏకారణం చేత పూర్తి చేయలేకపోయారో వివరంగా రాసుకుని, తర్వాతి రోజు ఆ పెండింగ్ కార్యక్రమాలను పూర్తిచేయడమెలాగో ఆలోచించాలని సలహా ఇస్తున్నారు. ఇలా సమయపాలనతో ముందుకు సాగినట్టయితే విజయం తప్పక వరిస్తుందని నిపుణులు చెపుతున్నారు.దీనిపై మరింత చదవండి :