శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 సెప్టెంబరు 2020 (14:55 IST)

దసరా, దీపావళి సీజన్-అమేజాన్, ఫ్లిఫ్‌కార్ట్‌లో 3లక్షల పోస్టులు

దసరా, దీపావళి సీజన్ వచ్చేసింది. ఈ-కామర్స్ సైట్లలో ఫెస్టివల్ సేల్ కూడా మొదలైంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో వరుసగా సేల్స్ వుంటాయి. అమేజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, ఆజియో, పేటీఎం మాల్... ఇలా ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ అన్నీ భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తాయి. ఆఫర్స్ ఉన్నప్పుడు కొనేందుకు కస్టమర్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. దీంతో ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయి. ఫలితంగా పార్శిల్ డెలివరీస్ పెరుగుతాయి. 
 
అందుకే ఫెస్టివల్ సేల్ కోసం అమేజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి సంస్థలు తాత్కాలికంగా ఉద్యోగులను నియమించుకుంటాయి. వీటితో పాటు ఇకామర్స్ ఎక్స్‌ప్రెస్ లాంటి థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ సంస్థలు కూడా డెలివరీలు వేగంగా చేసేందుకు సిబ్బందిని నియమించుకుంటాయి. ఈసారి కరోనా వైరస్ సంక్షోభంతో ఎక్కువగా ఆన్‌లైన్ షాపింగ్ పైన ఆధారపడుతున్నారు కస్టమర్లు.
 
ఫెస్టివల్ సేల్ జరిగే అక్టోబర్, నవంబర్ నెలల్లో రోజూ 2.2 కోట్ల షిప్‌మెంట్స్ ఉంటాయని కన్సల్టింగ్ సంస్థ రెడ్‌సీర్ అంచనా వేస్తోంది. గతేడాది ఫెస్టీవ్ సీజన్‌లో రోజూ 1.2 కోట్ల షిప్‌మెంట్స్ డెలివరీ అయ్యేవి. ఈసారి మరో కోటి షిప్‌మెంట్స్ అదనంగా డెలివరీ అయ్యే అవకాశముంది. ఇంత భారీ స్థాయిలో వ్యాపారం జరుగుతుంది కాబట్టి ఈసారి 3,00,000 ఉద్యోగాలు కొత్తగా వస్తాయని కన్సల్టింగ్ సంస్థ రెడ్‌సీర్ అంచనా. వీటిలో 70 శాతం ఉద్యోగాలు అమేజాన్, ఫ్లిప్‌కార్ట్ కల్పించనున్నాయి.
 
ఈ డిమాండ్‌ను ముందే అంచనా వేస్తున్న ఇ-కామర్స్ సంస్థలు సప్లై చెయిన్, లాజిస్టిక్స్‌పై ఎక్కువగా దృష్టి పెట్టాయి. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ 70,000 ఉద్యోగాలను ప్రకటించింది. ఈసారి ఫెస్టివల్ సీజన్‌లో జరిగే బిగ్ బిలియన్ డేస్ సేల్ కోసం 70,000 ప్రత్యక్ష ఉద్యోగాలను కల్పిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ సప్లై చెయిన్‌లో ఎగ్జిక్యూటీవ్స్, పిక్కర్స్, ప్యాకర్స్, సార్టర్స్ లాంటి 70,000 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. వీటితో పాటు పరోక్షంగా లక్షలాది ఉద్యోగాలు లభించనున్నాయి. 
 
మరోవైపు అమేజాన్ కూడా కొత్తగా 200 డెలివరీ స్టేషన్స్ ఏర్పాటు చేసింది. ఇక ఇప్పటికే లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఇకామ్ ఎక్స్‌ప్రెస్ 30,000 ఉద్యోగాలను ప్రకటించింది. అక్టోబర్, నవంబర్ నెలల్లో ఫెస్టివల్ సేల్ సందర్భంగా వచ్చే ఆర్డర్స్‌ని డెలివరీ చేసేందుకు 30,000 పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఇకామ్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు డెలివరీ, షాడోఫాక్స్ లాంటి సంస్థలు కూడా కొత్త ఉద్యోగాలు కల్పించనున్నాయి.