రైల్వే నాన్ గెజిటెట్ ఉద్యోగాల్లో అగ్నివీర్‌కు రిజర్వేషన్
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన అగ్నివీర్‌లకు భారతీయ రైల్వే శాఖలో నాన్ గెజిటెడ్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కూడా కల్పించనున్నారు. ఈ ఉద్యోగాల భర్తీలో దశలవారీగా 15 శాతం మేరకు రిజర్వేషన్లు కల్పించనున్నారు. అలాగే, వయోపరిమితిలో కూడా సడలింపు ఇస్తారు. వీటితో పాటు ఫిజికల్ టెస్టుల్లో కూడా ఈ సడలింపు వర్తించనుంది.
దివ్యాంగులు (పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ-పీడబ్ల్యూబీడీ), మాజీ సైనికులు, యాక్ట్ అప్రంటీస్ కోర్సు పూర్తి చేసినవారితో సమానంగా లెవెల్-1లో 10 శాతం, లెవెల్-2, అంతకుమించిన నాన్ గెజిటెడ్ ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్లను అగ్నివీర్‌కు కల్పిస్తారు. తొలిబ్యాచ్ వారికి ఐదేళ్లు, తర్వాతి బ్యాచ్‌ల వారికి మూడేళ్లు చొప్పున సడలింపు ఇస్తారు.
నాలుగేళ్లు అగ్నివీర్లుగా ఉన్నవారికి ఈ సడలింపులు ఇవ్వాలని జనరల్ మేనేజర్లకు రైల్వే బోర్డు లేఖలు పంపింది. భర్తీకాని ఖాళీలు ఉంటే ఇతరులతో వాటిని నింపాలని తెలిపింది. అగ్నివీర్ల కోసం రిజర్వేషన్ విధానాన్ని ఆర్పీఎఫ్ కూడా రూపొందిస్తున్నట్లు సమాచారం.