ఆదివారం, 8 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 22 మార్చి 2016 (16:54 IST)

తిరువణ్ణామలై అంటేనే జయ పార్టీకి భయం భయం: ఈసారైనా పోటీ చేస్తుందా?

ఎంజీఆర్ పార్టీ తిరువణ్ణామలైలో గెలవకపోవడం ఏమిటి?

తమిళనాట ఎన్నికల ప్రచారం వేడెక్కింది. రాజకీయ పార్టీలన్నీ నువ్వా నేనా అంటూ ఎన్నికల బరిలోకి దిగేందుకు సై అంటున్నాయి. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల్లో విజయం సాధించే నియోజక వర్గాలపై ప్రత్యేక దృష్టి పెడుతూ.. పరాజయం తప్పదనే నియోజకవర్గాలపై వెనక్కి తగ్గుతున్నాయి. ఈ క్రమంలోనే తిరువణ్ణామలై నియోజకవర్గమంటే అన్నాడీఎంకే కాస్త వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ నియోజకవర్గంలో డీఎంకే తరఫున 1957, 1963, 1971, 1977 ఎన్నికల్లో పోటీ చేసిన పీయూ షణ్ముగం ఘన విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన అన్నాడీఎంకే గూటికి చేరుకుని.. 1980లో అన్నాడీఎంకే తరఫున పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్‌ అభ్యర్థి నారాయణస్వామి గెలుపొందారు. అన్నాడీఎంకేకు ఎదురైన ఈ చేదు అనుభవంతో 1980 నుంచి ఇక్కడ పోటీ చేయడం లేదు. 
 
కానీ 2006లో మాత్రం అన్నాడీఎంకే తరఫున సీనియర్‌ నేత పవన్‌కుమార్‌ పోటీ చేశారు. కానీ ఆయనకు కూడా ఓటమి తప్పలేదు. అలాగే 2011లో పోటీ చేసిన మాజీ మంత్రి రామచంద్రన్‌ కూడా డీఎంకే అభ్యర్థి చేతిలో ఓటమిని చవిచూశారు. ఈ నేపథ్యంలో ఈసారి తిరువణ్ణామలైలో అన్నాడీఎంకే పోటీ చేద్దామా వద్దా అనే డైలమాలో పడింది. 
 
గతంలో మాదిరిగా అభ్యర్థిని బరిలోకి దింపకపోతే.. వెనకడుగు వేసినట్లు అవుతుందని కూడా భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఇన్నేళ చరిత్రను ఈసారి తిరగరాయాలని కూడా అన్నాడీఎంకే భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా తిరుగులేని చరిత్రను రాసిన ఎంజీఆర్‌ పార్టీ.. తిరువణ్ణామలైలో మాత్రం గెలవలేకపోవడం ఏంటనేది ఇప్పటికీ విశ్లేషకులకు అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది.