చెన్నైలో కాల్ సెంటర్ మోసం :: అతని నెల వేతనం రూ.12 వేలు.. జల్సాలు? (వీడియో)

Last Updated: శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (19:38 IST)
చెన్నై మహానగరంలో ఓ కాల్ సెంటర్ మోసం వెలుగులోకి వచ్చింది. అనేక మందికి ఉద్యోగాలతో పాటు.. తక్కువ మొత్తానికి బ్యాంకు రుణాలు తీసిస్తామని చెప్పి అనేక మంది నుంచి లక్షలాది రూపాయలను వసూలు చేసి మోసం చేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.


ముఖ్యంగా, ఈ కాల్ సెంటర్ యజమానికి కుడిభుజంగా ఉన్న ఓ ఉద్యోగి రాజభోగాలు అనువించాడు. అతని వేతనం నెలకు రూ.12 వేలు అయినప్పటికీ.. ఇన్సెంటివ్‌ల రూపంలో భారీ మొత్తం ఇచ్చినట్టు తేలింది. ఈ డబ్బుతో ఆ ఉద్యోగి జల్సాలు చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ వ్యక్తి చెన్నై నగరంలో ఏడు ప్రాంతాల్లో కాల్ సెంటర్లు ప్రారంభించాడు. ఈ సెంటర్‌లలో ఉద్యోగాలతో పాటు తక్కువ మొత్తానికే బ్యాంకు రుణాలు ఇప్పిస్తానని అనేక మందిని నమ్మించాడు.

ఈ కాల్ సెంటర్ యజమానికి స్థానిక వ్యాసార్పాడికి చెందిన జాన్సన్ (25) అనే వ్యక్తి కుడిభుజంగా వ్యవహరించాడు. ఈ మోసం కేసులో మొత్తం ఏడుగురు నిందితులుగా ఉన్నారు. వీరిలో జాన్సన్‌ను మాత్రం పోలీసులు అరెస్టు చేశారు. కాల్ సెంటర్ యజమాని మాత్రం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
 
అరెస్టు చేసిన జాన్సన్స్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో.. చెన్నై, చేట్‌ఫట్, ఆదంబాక్కం, తరమణి వంటి ప్రాంతాల్లో కాల్‌సెంటర్లను నడిపినట్లు తెలిపాడు. ఈ కాల్ సెంటర్లను తమిళనాడు మొత్తం నిర్వహించాలని పక్కా ప్లాన్ వేశామని చెప్పాడు. అయితే అంతలోపే పోలీసుల చేతిలో దొరికిపోయినట్లు వెల్లడించాడు.

జాన్సన్ డిప్లమో ఇంజినీరింగ్ ముగించి.. కాల్ సెంటర్లో గత ఏడాది చేరాడు. జాన్సన్ పనితీరును గమనించిన అతని యజమాని తనకు విశ్వాసపాత్రుడిగా మార్చుకున్నాడు. జాన్సన్ ద్వారానే పలు కాల్ సెంటర్లను సమర్థవంతంగా ఆ ఓనర్ నడపగలిగాడు. 
 
కాల్ సెంటర్ మాత్రమే కాకుండా తన వ్యక్తిగత పనులకు కూడా జాన్సన్‌ను ఉపయోగించుకున్నాడు. ఇలా కాల్ సెంటర్ మోసంతో వచ్చే నగదు మొత్తం జాన్సన్ బ్యాంక్ అకౌంట్ నుంచి కాల్ సెంటర్ ఓనర్‌కు చేరుతుంది. జాన్సన్‌కు నెలకు రూ.12వేలు మాత్రమే జీతంగా ఇవ్వడం జరిగింది.


దీంతో జాన్సన్ విశ్వాసాన్ని గమనించి ఓనర్ ఇన్‌సెంటివ్ పేరిట అతనికి లెక్కలేకుండా డబ్బును ఇచ్చేవాడు. ఫలితంగా జాన్సన్ విలాసవంతంగా జీవించడం మొదలెట్టాడు. ఎప్పుడూ కాల్ సెంటర్ ఓనర్‌తో జాన్సన్ తిరిగేవాడు. 
 
ఫైనాన్షియల్‌కు సంబంధించిన ఐడియాల కోసం ఎప్పుడూ ఓనర్ వెంటే జాన్సన్ వుండేవాడు. ప్రస్తుతం పరారీలో వున్న కాల్ సెంటర్ ఓనర్ కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు చెప్పుకొచ్చారు. విచారణ సందర్భంగా జాన్సన్ తన తప్పును అంగీకరించినట్లు మాట్లాడాడు. బాస్‌కు విశ్వాసంగా వుండి.. చాలా తప్పులు చేశానని పశ్చాత్తాపడినట్లు పోలీసులు తెలిపారు.దీనిపై మరింత చదవండి :