శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 6 జనవరి 2017 (14:05 IST)

తెలుగు నిండుతనం నిలబెట్టుకుంటే మాతృభాషను కాపాడుకొన్నట్టే.. ఐటీ కమిషనర్ శ్రీనివాసరావు

తెలుగుతనాన్ని నిలబెట్టుకుంటే మాతృభాషను కాపాడుకోవచ్చని చెన్నైలోని ఆదాపయన్ను శాఖ కమిషనర్ డాక్టర్ ఎం.శ్రీనివాస రావు అన్నారు. ఎందరో మహానుభావులు తెలుగును నిలబెట్టి మనకు అందించారనీ, మనం దానిని భావితరాలకు అం

తెలుగుతనాన్ని నిలబెట్టుకుంటే మాతృభాషను కాపాడుకోవచ్చని చెన్నైలోని ఆదాపయన్ను శాఖ కమిషనర్ డాక్టర్ ఎం.శ్రీనివాస రావు అన్నారు. ఎందరో మహానుభావులు తెలుగును నిలబెట్టి మనకు అందించారనీ, మనం దానిని భావితరాలకు అందించేందుకు కంకణం కట్టుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
 
"తెలుగు భాషకు ప్రాచీన హోదా - విహంగ వీక్షణం" అనే గ్రంథాన్ని చెన్నపురిలో ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని పొట్టిశ్రీరాములు స్మారక మందిర వ్యవస్థాపక సభ్యుడు వైఎస్.శాస్త్రికి అంకితమిచ్చారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ప్రముఖ సినీ గేయరచయిత వెన్నెలకంటి అధ్యక్షత వహించగా, రాజధాని కళాశాల విశ్రాంత ఆచార్యులు ఎల్.బి.శంకర రావు విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భగా ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగు భాషకు ప్రాచీన హోదా సాధన వెనుక జరిగిన మహోన్నతమైన పోరాటలకు నిదర్శనమైన ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. ఇతర భాషల కంటే మన తెలుగు భాష మృదువుగా, సంప్రదాయంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. 
 
అయితే, మారుతున్న కాలంతో పాటు తెలుగు ప్రజలు కూడా తెలుగు పండుగలు, చేతి వృత్తులను మరిచిపోతున్నారనీ, అలాంటపుడు తెలుగు భాష మాత్రం ఎలా నిలబడుతుందన్నారు. ప్రపంచీకరణతో మనల్ని మనం కోల్పోతున్నామనీ, మన పండుగలు, సంప్రదాయాలు వాటితోపాటు.. భాష మరుగన పడిపోతున్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుతనాన్ని నిలబెట్టుకుంటే తెలుగు భాషను కాపాడుకోవచ్చన్నారు.
 
కార్యక్రమ అధ్యక్షుడు వెన్నెలకంటి మాట్లాడుతూ... తెలుగు భాషకు ప్రాచీన హోదాని నిలబెట్టడం కోసం ప్రభుత్వం కంటే ముందు కోర్టు మెట్లెక్కిన గొప్ప భాషోద్యమకారుడు తూమాటి సంజీవరావు అని కొనియాడారు. గుర్తింపు కోసం వెంపర్లాడకుండా మాతృభాష కోసం నిస్వార్థంగా కృషి చేసిన ఆయన సేవలు అనన్యసామాన్యమని కొనియాడారు. ఆ తర్వాత ఆత్మీయ అతిథి ఎల్.బి.శంకర్ రావు మాట్లాడుతూ... తెలుగు భాషకు ఎంతో సేవ చేసిన వైఎస్ శాస్త్రికి ఈ పుస్తకం అంకితమివ్వడం అత్యంత సముచితమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు.