మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 25 ఫిబ్రవరి 2017 (08:05 IST)

వెన్నుపోటు పొడవలేదు.. పార్టీని చీల్చలేదు.. పళనిస్వామి మంచోడే కదా!

ప్రత్యర్థి పక్షంలో ఉన్న 122 మంది ఎమ్మెల్యేలతో కూడిన బలమైన శక్తిని ఎదుర్కొవాలంటి, దెబ్బతీయాలంటే అవతలి వాళ్లకు ఎంత ఐక్యత కావాలి. ఎంత దృఢసంకల్పం కావాలి. కానీ మేమే అమ్మ వారసులమని చెప్పుకుంటూనే పూటకో మాట మారుస్తూ, గడియకో నిర్ణయం ప్రకటిస్తూ ఉంటే మేరుపర్వతం

ప్రత్యర్థి పక్షంలో ఉన్న 122 మంది ఎమ్మెల్యేలతో కూడిన బలమైన శక్తిని ఎదుర్కొవాలంటి, దెబ్బతీయాలంటే అవతలి వాళ్లకు ఎంత ఐక్యత కావాలి. ఎంత దృఢసంకల్పం కావాలి. కానీ మేమే అమ్మ వారసులమని చెప్పుకుంటూనే పూటకో మాట మారుస్తూ, గడియకో నిర్ణయం ప్రకటిస్తూ ఉంటే మేరుపర్వతం ఎక్కడైనా తల వంచుతుందా?
 
ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నిజమైన అమ్మ అభిమానులు తామేనంటూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. శశికళ వర్గంని ఢీకొనేందుకు కలిసే వచ్చే అన్ని శక్తులనూ కలుపుకుపోతానని చెబుతున్నారు. 
 
ఇంకో వైపు నాలుగు రోజుల క్రితం అదే పన్నీర్ సెల్వంతో చేతులు కలుపుతానని  అమ్మ సమాధి సాక్షిగా ప్రకటించిన ఆమె మేనకోడలు దీప మాట మార్చేసి ఎంజిఆర్ అమ్మ దీప పెరవై అనే పేరుతూ రాజకీయ ఫోరం పెట్టేశారు. ఇది రాజకీయ పార్టీ కాదు సంఘం మాత్రమేనన్నారు. అన్నాడీఎంకే చిహ్నమైన రెండు ఆకుల గుర్తును తిరిగి స్వాధీనం చేసుకొని.. అమ్మ పాలన అందించడమే లక్ష్యమని ప్రకటించారు. మీడియానుద్దేశించి దీప మాట్లాడుతూ.. శశికళ దుష్ట శక్తి అని అభివర్ణించారు. ఆర్కే నగర్‌ నుంచి తాను పోటీ చేస్తానని ప్రకటించేశారు. 
 
సంఖ్యా బలం రీత్యా తిరుగులేని సత్తా ప్రదర్శించిన శశికళ వర్గం అనుయాయి ముఖ్యమంత్రి పళనిస్వామిని పడగొట్టడం అంత సులభమా?  భావ సారూప్యత కలిగిన వర్గాల మధ్య  ఐక్యత లేకుండా  దీపా పోటీ పార్టీ పెట్టి బలమైన చిన్నమ్మ వర్గాన్ని, దాని సీఎంని ఎలా ఢీకొంటుంది అన్నదే అర్థం కాని విషయం.
 
పైగా పళనిస్వామి ఎవరినీ వెన్నుపోటు పొడిచి అధికారం స్వీకరించలేదు. తామే అమ్మకు వారసులమని క్యాంపు పెట్టి ఎమ్మెల్యేలను నిలపుకుని మరీ తానేంటో నిరూపించుకన్నారు. పైగా సీఎం కాగానే పంచ సంతకాలు పెట్టడం ద్వారా నడుస్తున్నది అమ్మ పాలనే అని జనంలో సంకేతం పంపేశారు కూడా.  రాష్ట్రాలకు బంగారు గనిలా తయారైన మద్యం షాపులపైనే చేయివేసి 500 షాపులను అమ్మ కోరిక ప్రకారం రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఒక్క ప్రకటన విలువ తమిళనాడుకు వెయ్యి కోట్ల ఆదాయాన్ని లేకుండా చేస్తోంది. పైగా మహిళా ఉద్యోగులందరికీ బైక్ కొనేందుకు రాయితీతో కూడిన రుణాలు ఇస్తామన్నారు. అమ్మ కోరినట్లే చేస్తామని చెప్ప మరీ చేస్తున్నారు. ఇవన్నీ పళనిస్వామిని మంచి స్థానంలోనే కట్టబెట్టతాయి కదా. ఇక దీపా పళనిని ఎలా అడ్డుకోగలుగుతుంది?
 
పైగా ఒక పార్టీ నిలువునా చీలినప్పుడు, తిరుగుబాటు జరిగినప్పుడు బలమైన వర్గంపై తాత్కాలికంగా తిరుగుబాటు ప్రకటించి పోటీ పార్టీని పెట్టినవారు తర్వాత చరిత్రలో అడ్రస్ లేకుండా పోయారు. ఎన్టీరామారావు పార్టీని చంద్రబాబు అమాంతం లాగేసుకున్నప్పుడు లక్ష్మీ పార్వతి వెంటన అన్ని తెలుగుదేశం అంటూ ఒక పార్టీని, తర్వాత కొద్దినెలలకు చంద్రబాబు తంతే అంతదూరం పోయి పడ్డ హరికృష్ణ ఒక పార్టీని ఆర్భాటంగా పెట్టారు. కానీ ఎం జరిగింది. తర్వాత ఎన్నికల వరకు కూడా కాదు కొద్ది నెలల్లోపే అవి సోదిలో కూడా లేకుండా పోయాయి. 
 
వెన్నుపోటు చరిత్ర లేని పళనిస్వామిని ఢీకొనాలంటే ఎంత ఐక్యత కావాలి. కానీ అప్పుడే దీపా తాను పన్నీర్ సెల్వంతో కలిసేది లేదు పో అనేశారు. ఇది ప్రజలకు ఇచ్చే మెసేజ్ ఏంటి?
 
అంతకుమించి వెన్ను పోట్లు పొడిచినవారిని సైతం మొదట్లో ఈసడించుకున్న ప్రజలు కొన్నాళ్లు గడిచేసరికి జరిగిందంతా మర్చిపోయి అదే వెన్నుపోటుదార్లతో కలిసిపోయారు. ఇంకా చెప్పాలంటే వెన్నుపోటుదార్ల పాలనను అనుసరించడం అలవాటు చేసుకున్నారు. ఇంత అన్యాయం చేశాడే అనే మాట సగటు జీవితంలో చెల్లుతుందేమో కానీ రాజకీయ జీవితంలో చెల్లుబాటు కాదు. భారత దేశంలో తప్పు చేసినవారిని, తప్పుచేశారు అని తాము బావించినవారిని జనం క్షమించేయడం, అలవాటుగా వారిపక్కే తిరగటం చాలాసార్లు జరిగింది.
 
మరి తమిళనాడులో ప్రస్తుత పరిస్థితుల్లో పళనిస్వామిని జనం గౌరవించరని ఎందుకనుకోవాలి. అసెంబ్లీలో బలపరీక్ష సరిగా జరగలేదనే కారణంతో గవర్నరో, రాష్ట్రపతో, లేదా కేంద్రప్రభుత్వమో ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టడమే, మళ్లీ ఎన్నికలు పెట్టడమో జరిగే పరిస్థితి కూడా లేది. మరి అమ్మ చెప్పినవి చేస్తున్నానంటూ నాలుగు సంక్షేమ పథకాలు అమలు చేస్తే జనం పళని వెనక ఉన్న శశికళాంబను మర్చిపోయి ఫళనిని తమవాడిగా స్వీకరించరా.? 
 
దీపకాని, పన్నీర్ సెల్వం కాని న్యాయం తమవైపే ఉందని, అమ్మ రాజకీయ వారసత్వం నాదేనని వాదించి ఊరకుంటే పళనిస్వామి ఒక క్రమంలో రాష్టంపై పట్టు సాదించడం ఈజీ. నాలుగేళ్ల తర్వాత పళనిని ఎన్నికల్లో డీకొని అటో ఇటో తేల్చుకోవాలని అనుకునే వారు అంతవరకూ రాజకీయాల్లో ఉంటారా లేక ఏపీలో లక్మీ పార్వతి, హరికృష్ణ విషయంలో జరిగినట్లు పగ్గాలు వదిలేసి ఎవరిదారిన వారు వెల్లిపోతారా.. 
 
ఈ విషయాన్ని కాలం తేల్చాల్సిందే. కానీ దుర్మార్గ పాలకులను కూడా జనం కొంత కాలం తర్వాత భరించి, అలవాటు చేసుకుంటున్న చరిత్ర మనది. పైగా పళని స్వామి అలాంటి దుర్మార్గుడు కాదు, ఇప్పటివరకూ మంచోడిలాగే ముద్ర వేసుకున్నారు. తనకు సమీప భవిష్యత్తులో వచ్చే ఢోకా ఏమీ లేదు. తమ వెంట వచ్చిన వర్గాలను నిలబెట్టుకుని రంగంలో నిలబడాల్సిన బాధ్యత పన్నీరు సెల్వం, దీపాలేద మరి.