శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. చైల్డ్ కేర్
Written By సిహెచ్
Last Updated : గురువారం, 6 జనవరి 2022 (23:01 IST)

ఎదిగే పిల్లలకు పాలు ఎంతో అవసరం, ఎలాంటివి ఇవ్వాలి? (video)

ఎదుగుతున్న పిల్లలకు పాలు చాలా అవసరం. అయితే, పిల్లలకు ఏ పాలు ఇవ్వడం మంచిదన్న విషయాన్ని పరిశీలించాలి. ఆవు, గేదె, మేకపాలు, స్కిమ్డ్‌ మిల్క్‌ లభిస్తాయి. ఆవు పాలు పిల్లలకు ఎంతో శ్రేష్టమయినవి. కొంతమంది, పాలు పిండగానే అలాగే త్రాగేస్తారు. ఆ పాలను గుమ్మపాలు అంటారు. పొదుగు నుంచీ పిండగానే అలాగే పచ్చిపాలను త్రాగడం మంచిది కాదు. ఆరోగ్యం మాట అటుంచి అనారోగ్యాలు చుట్టుముడతాయి.
 
ఆ పాలల్లో ప్రమాదకర మైన సూక్ష్మక్రిములు ఉండే అవకాశం ఎక్కువ. ఆ పాలు త్రాగిన పిల్లలకు సూక్ష్మక్రిములు శరీరంలోకి ప్రవేశించి ఇన్‌ఫెక్షన్‌ను, వ్యాధిని కలిగిస్తాయి. ఏ పాలనయినా బాగా వేడి చేసి పొంగిన తర్వాతనే పిల్లలకు త్రాగించడం ఆరోగ్యకరం. పాశ్చరైజ్డ్‌ మిల్క్‌ను కనీసం పదినిముషాలయినా కాచినట్లయితే అందులోని బాక్టీరియా నశిస్తుంది. ఆ పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడే పిల్లలకు త్రాగించాలి. 
 
చల్లారిపోయిన పాలను, నిలవ ఉన్న పాలను పిల్లలకు త్రాగించకూడదు. చిక్కగా ఉన్న పాలల్లో నీళ్ళు కలిపి త్రాగించాలంటే పాలు కాగుతున్నప్పుడే కొంచెం నీటిని కలపాలి. వేడిపాలల్లో చన్నీళ్ళు కలిపితే, ఆ నీటి ద్వారా బాక్టీరియా పాలల్లోకి ప్రవేశించి పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. పిల్లలకు పాలు పడకపోతే వాంతులు, విరేచనాలు, అజీర్తి వ్యాధులు కలుగుతాయి. పిల్లల వైద్యుని సంప్రదించి, పిల్లలకు ఏ పాలు త్రాగించాలన్నదీ తెలుసుకోవాలి. 
 
పశువుల పాలు త్రాగించేటప్పుడు పశువులకు చేపువచ్చి పాలివ్వటానికి ఇంజెక్షన్‌ ఇస్తారు కొంతమంది పాలవ్యాపారస్తులు. ఆ ఇంజెక్షన్‌లోని రసాయనిక మందు పాలలో ప్రవేశిస్తుంది. పశువులకు వ్యాధులొస్తే, ఆ సంగతి తెలియక పిల్లలకు ఆ పాలను త్రాగించినట్లయితే పిల్లలకు అనారోగ్యాలు కలుగుతాయి. ముఖ్యంగా పసిబిడ్డకు త్రాగించే పాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.