ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో అసాంఘీక కార్యకలాపాలు : విజయసాయిరెడ్డి
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌ను లక్ష్యంగా చేసుకుని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా పలు అసాంఘీక కార్యకలాపాలు సాగుతున్నట్టు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా, హుదూద్ తుఫాను బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం ద్వారం సాయం పేరుతో వంద కోట్ల రూపాయల మేరకు వసూళ్ళకు పాల్పడ్డారని ఆరోపించారు.
ఇదే అంశంపై ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 'విశాఖలో హుదూద్‌ను అడ్డుపెట్టుకుని తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తల నుంచి అప్పట్లో ఏకంగా రూ.100 కోట్ల వరకు ఎన్టీఆర్ ట్రస్టులోకి లాగారు. తుఫాను బాధితులకు పంచకుండా పెదబాబు, చినబాబులు ఈ మొత్తం సొమ్మును మింగేశారు. ఎన్టీఆర్ ట్రస్టు పేరిట తండ్రీ కొడుకులు అసాంఘిక కార్యకలాపాల మీద పూర్తి స్థాయి విచారణ కోరుతున్నా' అంటూ అందులో పేర్కొన్నారు.
అలాగే, మరో ట్వీట్‌లో 'ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచారు. మద్య నిషేధాన్ని వెన్నుపోటు పొడిచారు. ఎన్టీఆర్ ట్రస్టును లాక్కున్నారు. సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకున్నారు. తుఫాను బాధితులకు అంటూ కలెక్షన్లులాగి కోట్లు మింగేశారు. ఏ లోకంలో ఉన్నారోగానీ, ఎన్టీఆర్‌గారూ... మీ అల్లుడి అరాచకాల మీద ఇక కొరఢా తీయండి! తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఇప్పటికైనా నిజాలు తెలుసుకోవాలి. త్యాగాలు మీవి... భోగాలు వారివి! నాలుగు దశాబ్దాలుగా చంద్రబాబుకు పావులుగా ఉపయోగపడిన నాయకులూ, కార్యకర్తలూ నిలదీయండి. మీరిచ్చిన విరాళాలు ఎటు పోయాయని అడగండంటూ' అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
అంతేకాకుండా, ఏపీలో మద్యం ధరలను ఏకంగా 75 శాతం మేరకు పెంచడంపై కూడా విజయసాయి వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో మద్యపానాన్ని నిరుత్సాహ పరచడమే ప్రభుత్వ విధానమని, ఇందులో భాగంగానే మద్యం ధరలను 75 శాతం పెంచామని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారని గుర్తుచేశారు. అయితే దీనిని రాజకీయం చేయాలని పచ్చచొక్కా నేతలు నిర్ణయించుకున్నారని ఆయన దుయ్యబట్టారు.