శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 మే 2021 (12:00 IST)

దేశంలో సగం మంది ప్రజలు మాస్క్ ధరించడం లేదు.. కేంద్ర ఆరోగ్య శాఖ

కరోనా విజృంభిస్తోంది. ఇందుకు కారణం మాస్క్ ధరించకపోవడమే. దేశంలో ఇప్పటికీ సగం మంది ప్రజలు మాస్క్‌ ధరించడం లేదని.. మిగతా సగంమందిలో 64 శాతం మంది నోరు మాత్రమే కప్పి ఉంచేలా మాస్క్‌ ధరిస్తున్నారని ఓ అధ్యయనాన్ని ఉటంకిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. 20 శాతం మంది గడ్డం వరకు, 2 శాతం మెడ దగ్గరకు పెట్టుకుంటున్నారని వివరించింది. కేవలం 14 శాతం మంది మాత్రమే కచ్చితంగా ధరిస్తున్నారని తెలిపింది. 
 
కాగా, పదివారాల పాటు పెరుగుతూ పోయిన పాజిటివ్‌ రేటు గత రెండు వారాలుగా తగ్గుతోందని వివరించింది. గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్‌ 29-మే 5 మధ్య పాజిటివ్‌ రేటు తగ్గుదల ఉన్న జిల్లాల సంఖ్య 210 కాగా.. ప్రస్తుతం 303కు చేరిందని తెలిపారు. 
 
ప్రస్తుతం దేశంలో పాజిటివ్‌ రేటు అత్యల్పంగా 13.31 ఉందని చెప్పారు. 194 జిల్లాల్లో కేసులు, 121 జిల్లాల్లో పాజిటివ్‌ రేటు పెరుగుతోందని వివరించారు. ఏడు రాష్ట్రాల్లో పాజిటివ్‌ రేటు 25పైన, 22 రాష్ట్రాల్లో 15 పైగా ఉందన్నారు.
 
కర్ణాటక, బెంగాల్‌లో పాజిటివ్‌ రేటు 25పైనే ఉండటం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. ఫిబ్రవరి మధ్య నుంచి చూస్తే ప్రస్తుతం రోజువారీ పరీక్షలు 2.3 రెట్లు పెరిగాయని.. జూన్‌ నెలాఖరుకు రోజుకు 45 లక్షల పరీక్షలు చేసే స్థితికి చేరుకోగలమని వివరించారు.