గాల్లో 10 మీటర్ల వరకు ట్రావెల్ చేసే కరోనా ఏరోసోల్స్
కరోనా వైరస్ మహమ్మారి పేరు వింటేనే ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. అయితే, ఈ వైరస్ వ్యాప్తి మూడు విధాలుగా జరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇందులో ఒకటి తుంపర్లు. వైరస్ సంక్రమించిన వ్యక్తి.. తుమ్మినా.. దగ్గినా.. ఆ తుంపర్లు సుమారు రెండు మీటర్ల దూరం ప్రయాణిస్తాయి.
ఇక రెండోది ఏరోసోల్స్. ఏరోసోల్స్ అంటే అతిసూక్ష్మ తుంపర్లు. ఈ ఏరోసోల్స్ గాలిలో సుమారు పది మీటర్లు ప్రయాణిస్తాయని ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఆఫీసు తన మార్గదర్శకాల్లో పేర్కొన్నది. పాజిటివ్ వ్యక్తి నుంచి రిలీజైన తుంపర్లు ఏదైనా వస్తువుపై పడినా.. ఆ సర్ఫేస్‌పై వైరస్ సజీవంగా కొంత సమయం ఉంటుంది. ఇది మూడవ మార్గం.
అయితే పెద్ద సైజులో ఉండే తుంపర్లు సాధారణంగా .. కింద పడిపోతాయి. కానీ చిన్న సైజులో ఉండే ఏరోసోల్స్ మాత్రం చాలా దూరమే ప్రయాణిస్తాయి. అవి కనీసం పది మీటర్ల దూరం ప్రయాణిస్తాయని ప్రభుత్వ సైంటిఫిక్ అడ్వైజర్ స్పష్టం చేశారు. దీని వల్ల ఎక్కువ శాతం వైరస్ సంక్రమించే ప్రమాదం ఉన్నట్లు హెచ్చరించింది.
వైరస్ సంక్రమిత వ్యక్తి నుంచి వెలుబడిన తుంపర్లు వేర్వేరు ప్రదేశాల్లో.. వేర్వేరు వస్తువులపై పడుతుంటాయి. అయితే కలుషితమైన ఆ ప్రదేశాలను ఎవరైనా ముట్టుకుని.. చేతులను శానిటైజ్ చేసుకోకుండా.. నోట్లో కానీ, కంట్లో కానీ, ముక్కులో కానీ పెట్టుకుంటే, దాని ద్వారా వైరస్ వ్యాప్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. గ్లాస్, ప్లాస్టిక్, స్టీల్ లాంటి వస్తువులపై.. వైరస్ ఎక్కువ కాలం జీవిస్తుందని సైంటిఫిక్ అడ్వైజరీ పేర్కొన్నది.