డ్రాగన్ కంట్రీని మళ్లీ వెనుకేసుకొచ్చిన డబ్ల్యూహెచ్‌వో
చైనాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మరోమారు వత్తాసు పలికింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు పుట్టినిల్లుగా ఉన్న వుహాన్ నగరంలో మరణాలను తక్కువ చేసి చూపించిన విషయంలో చైనా తప్పేం లేదని డబ్ల్యూహెచ్‌వో చెప్పుకొచ్చింది.
నిజానికి కరోనా వైరస్ వ్యవహారంలో చైనాకు ఈ సంస్థ వత్తాసు పలుకుతోందని, ప్రపంచాన్ని చైనాతో డబ్ల్యూహెచ్ఓ తప్పుదారిపట్టించాయని అమెరికాతో సహా అనేక అగ్రదేశాలు గుర్రుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇపుడు వుహాన్ మరణాలను పునఃసమీక్షించి వాటిని ఎక్కువ చూపడం, ఈ విషయంలో చైనాను డబ్ల్యూహెచ్ఓ సమర్థించడం ఇపుడు మరోమారు చర్చకు దారితీసింది.
తాజాగా చైనా.. వూహాన్‌లోని మరణాలపై సమీక్ష నిర్వహించగా అవి ఏకంగా 50 శాతం పెరిగాయి. దీంతో కొవిడ్ వ్యాప్తిని చైనా దాస్తోందన్న ప్రపంచ దేశాల వాదనకు బలం చేకూరింది. ఈ అంశంలో చైనాను డబ్ల్యూహెచ్‌వో వెనకేసుకొచ్చింది. ఈ విషయంలో చైనా తప్పేమీ లేదని, డిసెంబరులో వూహాన్‌ను కరోనా కమ్మేసినప్పుడు.. ప్రతి మరణాన్నీ, కేసునీ లెక్కించడంలో అక్కడి అధికారులు విఫలమయ్యారని వ్యాఖ్యానించింది.
చాలా మరణాలు ఇళ్లలోనే సంభవించాయని, అక్కడి వైద్యులు కూడా చికిత్స చేయడంలో బిజీగా ఉన్నందువల్ల అన్ని వివరాలను రికార్డుల్లోకి ఎక్కించలేకపోయారని డబ్ల్యూహెచ్‌వో టెక్నికల్ లీడర్ మరియా వాన్ కెర్ఖోవ్ వివరించారు. 'మరణాలను, కేసులను గుర్తించడం ఓ సవాల్. ఈ స్థితిని అన్ని దేశాలూ ఎదుర్కొంటాయి' అని ఆమె వ్యాఖ్యానించారు.