corona medicine: మరో ఔషధానికి అనుమతి
న్యూదిల్లీ: కరోనా బాధితులకు ఉపశమనం కలిగించేలా పలు ఔషధాలకు భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) త్వరగా అనుమతులు మంజూరు చేస్తోంది. ఇందులో భాగంగానే అత్యవసర వినియోగానికి మరో ఔషధం అందుబాటులోకి రానుంది. డీఆర్‌డీవో లేబొరేటరీ ఇన్మాస్, రెడ్డి ల్యాబ్స్(హైదరాబాద్) సంయుక్తంగా అభివృద్ధి చేసిన 2-డీజీ ఔషధం వినియోగానికి డీసీజీఐ అనుమతి ఇచ్చింది.
కరోనా చికిత్సకు అనుమతించినట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. స్వల్ప, మధ్యస్థాయి కరోనా లక్షణాలతో బాధపడేవారికి ఇది బాగా పనిచేస్తుందని డీసీజీఐ తెలిపింది. ఇది పౌడర్ రూపంలో లభించనుంది. 2-డీజీ ఔషధాన్ని నీళ్లలో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. వైరస్ ఇన్‌ఫెక్ట్ అయిన సెల్స్‌తో పాటు, శరీరంలో వైరస్ వేగంగా వ్యాపించకుండా అడ్డుకుంటుంది అని డీఆర్‌డీవో వెల్లడించింది.