అక్టోబరు నుంచి దేశంలో కరోనా థర్డ్ వేవ్?
కరోనా వైరస్ దెబ్బకు భారతదేశం అతలాకుతలమైపోయింది. ముఖ్యంగా, రెండో దశ వ్యాప్తి అల్లకల్లోలం సృష్టించింది. వేలాది మంది మరణాలు నమోదయ్యాయి. ప్రతి రోజూ లక్షలాది కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ప్రస్తుతం కరోనా ఉధృతి తగ్గడంతో భారత్ క్రమంగా కోలుకుంటోంది.
ఇప్పుడిప్పుడే రోజువారీ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఆసుపత్రులు, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై పడిన ఒత్తిడి తగ్గుతోంది. ఈ తరుణంలో థర్డ్ వేవ్ ముప్పు సాధ్యాసాధ్యాలపై ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ఓ సర్వే నిర్వహించింది. జూన్ 3-17 మధ్య జరిగిన ఈ సర్వేలో వైద్యులు, ఆరోగ్యసంరక్షణా నిపుణులు, శాస్త్రవేత్తలు, వైరాలజిస్టులు, ఎపిడెమాలజిస్టులు, ప్రొఫెసర్లు మొత్తం 40 మంది ప్రముఖులు పాల్గొన్నారు.
భారత్‌లో అక్టోబరు నాటికి కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం మెరుగ్గా ఉందని 21 మంది వైద్య నిపుణులు హెచ్చరించారు. మరో ముగ్గురు ఆగస్టు నాటికి.. మరో 12 మంది సెప్టెంబరు కల్లా భారత్‌లో మరోసారి కరోనా విజృంభించొచ్చని అంచనా వేశారు. ఇక మిగిలిన ముగ్గురు నవంబరు-డిసెంబరు మధ్య థర్డ్ వేవ్ ముప్పు రావొచ్చని అభిప్రాయపడ్డారు.
అయితే, రెండో దశ కరోనాతో పోలిస్తే థర్డ్ వేవ్‌ను నియంత్రించగలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని 34 మందిలో 24 మంది అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్లు, ఔషధాలు, ఆక్సిజన్, ఆసుపత్రుల్లో పడకలు వంటి మౌలిక సదుపాయాలను రెండో దశ వ్యాప్తి సమయంలో మెరుగుపరుచుకోవడం జరిగిందన్నారు. అందువల్ల థర్డ్ వేవ్ ముప్పు పెద్దగా ఉండబోదని అభిప్రాయపడ్డారు.
దీనికితోడు విస్తృత స్థాయిలో వ్యాక్సినేషన్ అందుబాటులోకి రావడం, రెండో దశ ఉద్ధృతి వల్ల వచ్చిన సహజ రోగనిరోధక వ్యవస్థ వంటి అంశాలు థర్డ్ వేవ్‌ను నియంత్రణలో ఉంచనున్నాయని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా వెల్లడించారు. ఈ ఏడాదే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కానున్నట్లు అత్యధిక మంది ఆరోగ్యసంరక్షణా నిపుణులు తెలిపారు.