శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By జె
Last Modified: గురువారం, 30 ఏప్రియల్ 2020 (16:47 IST)

పోలీసులు కళ్ళు గప్పి తమిళనాడు సరిహద్దు దాటాడు, భార్యకు కరోనా అంటించాడు

భార్య ఒంటరిగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఎలాగైనా ఇంటికి రావాలని నిర్ణయించుకున్నాడు. సరిహద్దులను పట్టించుకోలేదు. పోలీసుల కళ్ళు గప్పాడు. గ్రామాల మీదుగా ఎలాగోలా ఆంధ్రకు చేరుకున్నాడు. అంతటితో ఆగలేదు. తనకు కరోనా సోకిందన్న విషయం అర్థమైంది. స్నేహితులతో తిరిగాడు. భార్యతోనే ఉన్నాడు. చివరికి ఊపిరి పీల్చుకోవడం కష్టమై భార్యకు అసలు విషయం చెప్పేశాడు.
 
చిత్తూరులో మొట్టమొదటి పాజిటివ్ కేసు నమోదైంది. తమిళనాడు రాష్ట్రం అంజూరుకు చెందిన వ్యక్తి చిత్తూరు నగరంలో నివాసముండేవాడు. భార్యతో కలిసి చిత్తూరులో ఉంటున్నాడు. అయితే పని నిమిత్తం అంబూరుకు వెళ్ళి లాక్ డౌన్‌తో ఇరుక్కుపోయాడు. రోజులు గడుస్తున్నా సరిహద్దు నుంచి పంపించకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు.
 
అయితే తమిళనాడులో కరోనా రావడంతో ఇక బతుకుతామో లేదోనని భార్య దగ్గరకు ఎలాగోలా సరిహద్దులు దాటి వచ్చేశాడు. అయితే తనకు ఉన్న జబ్బును మాత్రం దాచి పెట్టాడు. స్నేహితులను కలిశాడు. మార్కెట్‌కు వెళ్ళాడు. భార్యతో కలిసి ఉన్నాడు. 
 
కానీ దగ్గు, జలుబు ఎక్కువవడం, జ్వరం కూడా ఉండటంతో భార్య నిలదీసింది. సాధారణ జలుబు అని చెప్పుకొచ్చాడు. కానీ నిన్న మద్యాహ్నం ఊపిరి పీల్చుకోవడం కష్టమవ్వడంతో అతన్ని హుటాహుటిన చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కరోనా లక్షణాలు ఉండటంతో పాటు రక్తపరీక్షల్లో కరోనా అని బయటపడింది. దీంతో హుటాహుటిన అతని స్నేహితులు, బంధువులను క్వారంటైన్‌కు తరలించారు. చిత్తూరులో మొదటి పాజిటివ్ కేసు నగరంలో నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.