1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 మే 2021 (10:17 IST)

కరోనా బులిటెన్ : గణనీయంగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అయితే క‌రోనా మ‌ర‌ణాల్లో మార్పు క‌నిపించ‌డం లేదు. రోజువారీ క‌రోనా కేసుల సంఖ్య రెండు ల‌క్ష‌ల‌కు ద‌గ్గ‌ర‌గా న‌మోదవుతుండ‌గా, రోజువారీ మరణాల సంఖ్య ఇప్పటికీ నాలుగు వేలకు దగ్గరగానే కొన‌సాగుతోంది. గ‌డ‌చిన 24 గంటల్లో కరోనా కార‌ణంగా 4,172 మంది క‌న్నుమూశారు. ఇది మంగళవారం నాటి గణాంకాల కంటే ఎక్కువ. 21 రోజుల తర్వాత ఈ స్థాయిలో అత్య‌ధిక‌ కేసులు నమోదయ్యాయి.
 
ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం గ‌డ‌చిన‌ 24 గంటల్లో దేశంలో కొత్త‌గా 2,08,886 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇదే స‌మ‌యంలో 4,172 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీనికి  ముందు మంగళవారం క‌రోనా మృతుల సంఖ్య‌ 3,498గా ఉంది. 
 
ఇదే సమయంలో ఆ రోజు కొత్తగా 1,95,815 క‌రోనా కేసులు నమోదయ్యాయి. ఇది రెండు లక్షల క‌న్నా త‌క్కువ‌. ఈ విధంగా చూస్తే గతంలో కంటే గ‌డ‌చిన 24 గంట‌ల్లో కరోనా కేసులలో పెరుగుదల క‌నిపించింది. కాగా దేశంలో అత్య‌ధిక కరోనా కేసులు మహారాష్ట్ర, కర్ణాటకలో న‌మోద‌వుతున్నాయి. 
 
దేశంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య‌ 2,71,56,382 ను దాటింది. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 24,90,876. కరోనా నుండి కోలుకుంటున్న బాధితుల సంఖ్య‌ క్రమంగా పెరుగుతుండటం ఉపశమనం కలిగించే విషయం. 
 
దేశంలో ఇప్పటివరకు 2,43,43,299 కరోనా బాధితులు వ్యాధి నుంచి కోలుకున్నారు. దేశంలో క‌రోనా మృతుల సంఖ్య మూడు లక్షలు దాటింది. కరోనా కార‌ణంగా ఇప్పటివరకు దేశంలో 3,11,421 మంది ప్రాణాలు కోల్పోయారు.