దేశంలో ఒకే రోజు 96424 పాజిటివ్ కేసులు ..
దేశంలో ఒకే రోజు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 10 రోజులుగా ప్రతిరోజూ 90 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దీంతో రోజువారీ కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతున్నది. తాజాగా మరో 96424 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 52 లక్షలు దాటిపోయింది.
ఇందులో 10,17,754 కేసులు యాక్టివ్‌గా ఉండగా, కరోనా బారినపడినవారిలో మరో 41,12,552 మంది కోలుకుని ఇంటికి చేరారు. నిన్న ఉదయం నుంచి నేటి ఉదయం వరకు కరోనాతో కొత్తగా 1174 మంది మరణించారు. దీంతో దేశంలో ఇప్పటివరకు 84,372 మంది బాధితులు చనిపోయారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.
మొత్తం యాక్టివ్ కేసుల్లో 60 శాతం కేసులు ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నాయని తెలిపింది. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 5 వేలలోపే యాక్టివ్ కేసులు ఉన్నాయని ప్రకటించింది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే 49 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయని వెల్లడించింది. అయితే మరణాల రేటు ఒక శాతం తగ్గి ప్రస్తుతం 1.64 శాతంగా ఉందని పేర్కొంది.