శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 మార్చి 2021 (10:35 IST)

మరోసారి విజృంభిస్తోన్న మహమ్మారి - మహారాష్ట్రదే అగ్రస్థానం

దేశంలో కరోనా వైరస్ మరోమారు తారా స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కేసుల్లో కొద్ది రోజులుగా పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ, గడిచిన 24 గంటల్లో వాటి సంఖ్య భారీగా పెరిగింది. బుధవారం 7,78,416 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 22,854 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. 126 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం కేసులు సంఖ్య 1,12,85,561కి చేరగా.. 1,58,189 మంది ప్రాణాలు వదిలారని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
కొత్త కేసులు ఎక్కువవుతుండటంతో క్రియాశీల కేసుల్లో కూడా పెరుగుదల కనిపించింది. ప్రస్తుతం 1,89,226 క్రియాశీల కేసులుండగా.. ఆ రేటు 1.68 శాతానికి చేరింది. అయితే వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కాస్త మెరుగ్గానే ఉంది. తాజాగా 18,100 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. రికవరీ రేటు 96.92 శాతానికి చేరింది. 
 
ఇదిలావుంటే, మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కలవరం పుట్టిస్తోంది. నిత్యం సుమారు 10 వేల కేసులు నమోదవుతున్నాయి. కానీ, నిన్న మాత్రం అత్యధికంగా 13,659 కొత్త కేసులు వెలుగుచూశాయి. 54 మరణాలు సంభవించాయి. లక్షకు పైగా క్రియాశీల కేసులు ఆ రాష్ట్రంలోనే ఉన్నాయి. 
 
దేశంలోని కొత్త కేసులు, మరణాల విషయంలో మహారాష్ట్ర వాటానే ఎక్కువగా ఉండటం అక్కడి ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రజలు స్వీయ క్రమశిక్షణ పాటించాలని మంత్రులు, అధికారులు హెచ్చరిస్తున్నారు. లేకపోతే  రాష్ట్రం మరోసారి లాక్‌డౌన్‌లోకి వెళ్లాల్సి ఉంటుందని చెబుతున్నారు.
 
మరోవైపు, దేశంలో కరోనా టీకా కార్యక్రమం నిరాంటకంగా కొనసాగుతోంది. రెండు దశలు కలుపుకొని మార్చి 10 నాటికి కేంద్రం 2,56,85,011 మందికి టీకా డోసులను పంపిణీ చేసింది. నిన్న ఒక్కరోజే 13,17,357 మంది టీకా వేయించుకున్నారు. 
 
ఇదిలావుంటే, తెలంగాణలో కొత్త‌గా 194 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 116 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,00,536 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,97,032 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,649గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,855 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 730 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్త‌గా 35 క‌రోనా కేసులు నమోద‌య్యాయి.