ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 19 మార్చి 2021 (19:06 IST)

కోవిడ్ వాక్సినేషన్‌తో అపోహలు వద్దు : డాక్టర్ అచ్యుత బాబు

కోవిడ్ వాక్సిన్ చేయించుకోవడం వల్ల ఎలాంటి అపోహలు చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ కామినేని అచ్యుత బాబు అన్నారు. లయన్స్ గవర్నర్ పుట్టగుంట వెంకట సతీష్ కుమార్ సహకారంతో ఏపీయూడబ్ల్యూజే సంయుక్తంగా ఆంధ్రా హాస్పిటల్‌లో జరుగుతున్న వాక్సినేషన్ కార్యక్రమం నాలుగో రోజు విజయవంతంగా కొనసాగుతోంది. ఆంధ్రా హాస్పిటల్‌లో జరుగుతున్న వాక్సినేషన్ కార్యక్రమాన్ని శుక్రవారం ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే నేతలు పర్యవేక్షించారు. 
 
ఈ సందర్భంగా నాయకులతో డాక్టర్ అచ్యుత బాబు నాయకులు అడిగిన పలు సందేహాలకు సమాధానం ఇచ్చారు. ఈనెల రెండో తేదీనుంచి 19వ తేదీ వరకూ ఆంధ్రా హాస్పిటల్‌లో కోవిషీల్డ్ 1650, కోవేక్సిన్ 400 మందికి వాక్సినేషన్ ఇచ్చామన్నారు. కోవాక్సిన్, కోవిషీల్డ్ అనేవి రెండు రకాల వాక్సినేషన్స్ జరుగుతున్నాయన్నారు. ఎక్కువగా కోవిషీల్డ్ ప్రభుత్వం సరఫరా జరుగుతుందన్నారు. 
 
కోవాక్సిన్ సరఫరా తక్కువగా ఉందని ఐతే ఒక వారం కోవేక్సిన్, మరో వారం కోవిషీల్డ్ సరఫరా చేస్తే ఎవరికి కావాల్సిన వాక్సినేషన్ వారు చేయించుకునే అవకాశం ఉంటుందని డాక్టర్ అచ్యుత బాబు అభిప్రయాపడ్డారు. రెండు రకాల వాక్సినేషన్ సమానంగానే సమాన స్థాయిలోనే పనిచేస్తాయన్నారు. 
 
ఈ విషయంలో ఎవరూ ఎలాంటి అపోహలకు, ఆందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని స్పష్టం ఆయన చేశారు. నాల్గవ రోజు జరుగుతున్న వాక్సినేషన్ శిబిరాన్ని పర్యవేక్షించిన వారిలో ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే అర్బన్ అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, కొండా రాజేశ్వరరావు, సీనియర్ జర్నలిస్టు షేక్ బాబు, లయన్స్ క్యాబినేట్ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, అడిషనల్ క్యాబినెట్ కార్యదర్శులు వై. రంగారావు, రామకృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
 
 
45 ఏళ్ల పైబడిన వారికే వాక్సినేషన్ 
ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రస్తుతం 45 ఏళ్ల పైబడిన వారికి మాత్రమే వాక్సినేషన్ ఇస్తున్నామని డాక్టర్ అచ్యుత బాబు తెలిపారు. నలభై ఐదేళ్ల నుంచి 59 ఏళ్ల లోపు వయసుగల వారు ఫ్యామిలీ డాక్టర్ సర్టిఫికెట్ తీసుకురావాలని తెలిపారు. 60 ఏళ్ల పైబడిన వారికి ఎలాంటి సర్టిఫికేట్ అవసరం లేదని, ప్రతి ఒక్కరూ తమ ఆధార్ కార్డును తీసుకురావాలని కోరారు. 
 
40 యేళ్ళ లోపు వారికి ప్రస్తుతం వాక్సినేషన్ ఇవ్వడం లేదన్నారు. జర్నలిస్టులు, తమ కుటుంబ సభ్యుల పేర్లను స్థానిక ప్రెస్ క్లబ్‌లో ఉదయం 10.30 నుంచి11.30 వరకూ నమోదు చేసుకోవాలన్నారు.  హాస్పిటల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ వాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగొంచుకోవాలని కోరారు.