శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 జులై 2020 (09:30 IST)

కరోనా సోకిందన్న భయంతో విద్యాశాఖ సూపరింటెండెంట్ ఆత్మహత్య

కరోనా వైరస్ సోకిందన్న  భయంతో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖలో సూపరింటెండెంట్ హోదాలా పని చేస్తుండటం గమనార్హం. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ కాలనీలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పట్టణంలోని క్రిస్టియన్ కాలనీకి చెందిన మామిడాల రాజా వెంకటరమణ (54) మంచిర్యాల విద్యాశాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తూ భార్య, కుమారుడితో కలిసి అక్కడే ఉంటున్నారు. 
 
అయితే, గత ఐదు రోజులుగా ఆయన జ్వరం, జలుబుతో బాధపడుతూ వచ్చాడు. దీంతో మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకున్నారు. పరీక్షించిన వైద్యుడు ఎందుకైనా మంచిదని, కరోనా పరీక్షలు చేయించుకోవాలని సలహా ఇచ్చారు. 
 
దీంతో ఆయన భయపడిపోయారు. తనకు ఖచ్చితంగా కరోనా సోకివుంటుందని అనుమానించిన వెంకటరమణ.. అదే రోజు సాయంత్రం వరకు విధులు నిర్వర్తించి, అక్కడి నుంచి ఇంటికి వెళ్లకుండా నేరుగా కరీంనగర్‌లో తన ఇంటికి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
ఉదయం విధులకు వెళ్లిన తండ్రి రాత్రయినా ఇంటికి రాకపోవడంతో అనుమానించిన ఆయన కుమారుడు విశ్వజిత్ కరీంనగర్‌లోని బంధువులకు ఫోన్‌లో విషయం చెప్పాడు. వారు అతడి ఇంటికి వెళ్లి చూడగా వెంకటరమణ ఉరికి వేలాడుతూ కనిపించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.