వెయ్యి దాటిన ఒమిక్రాన్ కేసులు - ఒమిక్రాన్ హాట్‌స్పాట్‌గా మహారాష్ట్ర
దేశంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యిదాటిపోయింది. తెలంగాణాలో కొత్తగా మరికొన్ని కేసులు వెలుగు చూశాయి. ముఖ్యంగా, ఒమిక్రాన్ హాట్‌స్పాట్‌గా మహారాష్ట్ర మారింది. దీంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.
ఇదిలావుంటే, దేశంలో ఈ ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి నానాటికీ పెరిగిపోతోంది. ఇప్పటికే 23 రాష్ట్రాలకు విస్తరించింది. దీంతో ఈ కొత్త వేరియంట్ కేసుల సంఖ్య వెయ్యిదాటిపోయి 1270కు చేరింది. అయితే, ఈ వైరస్ బారినపడిన వారిలో ఇప్పటివరకు 374 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
అయితే, ఒమిక్రాన్ కేసులకు మహారాష్ట్ర కేంద్రంగా మారడం ఇపుడు ఆందోళన రేకెత్తిస్తుంది. ఈ ఒక్క రాష్ట్రంలోనే పాజిటివ్ కేసులు ఏకంగా 450కు చేరుకున్నాయి. అలాగే, ఢిల్లీలో 320, కేరళలో 109, గుజరాత్‌లో 97, రాజస్థాన్‌లో 69, తెలంగాణాలో 62 చొప్పున నమోదై వున్నాయి.
మరోవైపు, కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 16,764కు చేరాయి. దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 3,48,38,804కు చేరుకున్నాయి.