ఒమిక్రాన్ ప్రవేశద్వారంగా శంషాబాద్ : హైదరాబాద్‌లో కలకలం
దేశంలో ఒమిక్రాన్ వైరస్ కలకలం సృష్టిస్తుంది. అనేక రాష్ట్రాల్లో రోజువారీగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. అలాంటి రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఒకటి. అయితే, ఈ రాష్ట్రంలో కరోనా ఒమిక్రాన్ కేసులకు ప్రవేశమార్గంగా శంషాబాద్ విమానాశ్రయం అడ్డాగా మారింది.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య ఆరు పదులు దాటిపోగా, శంషాబాద్ పరిధిలో మాత్రం నాలుగు కేసులు వెలుగు చూశాయి. పెద్దషాపూర్ ఆరోగ్య పరిధిలోని ఇందిరానగర్ దొడ్డికి చెందిన ఓ కుంటుంబం ఇటీవల దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చింది.
వీరికి విమానాశ్రయంలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో బాలుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆ తర్వాత జన్యుక్రమ పరీక్షలు చేయగా, ఒమిక్రాన్ పాజిటివ్ అని ఖరారైంది. అయితే, ఈ ఫలితాలు పూర్తిగా వెల్లడికాకముందే ఆ కుటుంబాన్ని ఇంటికి పంపించారు. దీంతో ఆ బాలుడు అనేక మంది స్థానిక పిల్లలతో కలిసి తిరిగాడు.
మూడు రోజుల తర్వా ఆ బాలుడికి ఒమిక్రాన్ అని తేలడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అతనితో కాంటాక్ట్ అయిన వారిలో 40 మందిని గుర్తించి పరీక్షలు చేయడంతో మరో ముగ్గురికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆర్టీపీసీఆర్ ఫలితాలు వచ్చేంత వరకు వేచిచూడకుండా ఆ బాలుడిని ఇంటికి పంపించడం వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైందనే విమర్శలు వస్తున్నాయి.