దేశంలో 781కు చేరిన ఒమిక్రాన్ కేసులు - ఢిల్లీలో ఎల్లో అలెర్ట్
దేశంలో ఒమిక్రాన్ వైరస్ చాప కిందనీరులా వ్యాపిస్తుంది. దీంతో ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బుధవారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన మేరకు ఇప్పటివరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 781కు చేరింది. వీటిలో ఒక్క తెలంగాణా రాష్ట్రంలోనే 62 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, గడిచిన 24 గంటల్లో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 9195కు చేరింది.
అలాగే, గత 24 గంటల్లో 7347 మంది ఈ వైరస్ నుంచి కోలుకోగా, ప్రస్తుతం దేశంలో 77,002 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటివరకు ఈ వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,42,51,292గా ఉందని పేర్కొంది.
మరోవైపు, దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. దీంతో రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్యలో పెరుగదల కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ కోవిడ్ పాజిటివిటీ రేటు 0.5 శాతంగా ఉంది. అయితే, ముందస్తు చర్యల్లో భాగంగా, ఢిల్లీలో ఎల్లో అలెర్ట్‌ను జారీ చేశారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, "రెండు రోజులకు పైగా కరోనా పరీక్షల్లో పాజిటివ్ రేటు 0.5 శాతానికి పైనే ఉంటుంది. అందువల్ల లెవల్-1 (ఎల్లో అలెర్ట్) క్రమానుగత ప్రతిస్పందన కార్యాచరణ ప్రణాళికను అమల్లోకి తీసుకొస్తున్నాం. అమలు చేసే ఆంక్షల వివరాలతో ఆదేశాలను త్వరలోనే విడుదల చేస్తాం" అని ప్రభుత్వ అధికారులో ఉన్నత స్థాయి సమీక్ష తర్వాత సీఎం కేజ్రీవాల్ ఈ విషయాన్ని వెల్లడించారు.
"ఢిల్లీలో కరోనా కేసుల పెరిగితే ఎదుర్కొనేందుకు గతంతో పోలిస్తే మేము 10 రెట్లు ఎక్కువ సన్నద్ధతో ఉన్నాం" అని సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. అదేసమయంలో రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్ర పెరుగుతున్నప్పటికీ.. ఆక్సిజన్, వెంటిలేటర్ల వినియోగం మాత్రం పెరగలేదని ఆయన గుర్తుచేశారు. ఏది ఏమైనా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎల్లో అలెర్ట్‌ను జారీ చేస్తున్నట్టు తెలిపారు.