టాటా గ్రూపు వెన్నెముక రతన్ టాటా - నేడు 84వ పుట్టినరోజు
భారతదేశ పారిశ్రామిక దిగ్గజాల్లో రతన్ టాటా ఒకరు. ఈయన జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా టాటా గ్రూపును ఆయన మరింత బలంగా చేసి నిలబెట్టారు. అలాగే, నాయకత్వ మార్పిడిలోనూ ఆయన అనేక సవాళ్లకు ఎదురొడ్డి నిలబడి, విజయం సాధించారు. అలాంటి రతన్ టాటా తన 84వ పుట్టినరోజు వేడుకలను మంగళవారం జరుపుకుంటున్నారు. తొలితరం పారిశ్రామికవేత్తగా ఆయన అనుభవసారాన్ని కొటేషన్లే చెబుతాయి.
* "వేగంగా నడవాలి అని అనుకుంటే మాత్రం నీవు ఒక్కడివే ఆ పని చేయి.. కానీ చాలా దూరం నడవాలంటే మాత్రం కలిసి నడవాలి".
* "సీరియస్‌గా ఉండకుండా జీవితాన్ని ఉన్నదున్నట్టుగా ఆస్వాదించాలి"
* "ఇతరులను కాపీ కొట్టే వ్యక్తి కొంత వరకు జయించవచ్చు. కానీ ఆ తర్వాత అతను మరింత విజయం సాధించలేడు."
* "ఇనుమును ఎవరూ నాశనం చేయలేరు. కానీ, దానంతట అదే తుప్పు పడుతుంది. అలాగే ఎవరూ ఒకరిని నాశనం చేయలేరు. సొంత మనస్తత్వమే అలా చేయగలదు".
* "ప్రజలు నీ మీద వేసే రాళ్లు స్వీకరించు. వాటిని ఉపయోగించి ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించు".
* "సరైన నిర్ణయాలు అనే దానిని నేను నమ్మను. నేను నిర్ణయాలు తీసుకుంటాను. వాటిని సరైన దారిలో నడిస్తాను".
* "మన జీవితంలో ముందుకు వెళ్లాలంటే ఎత్తు పల్లాలన్నవి ఎంతో ముఖ్యమైనవి. ఎత్తు పల్లాలు లేకుండా తిన్నగా సాగిపోతే... ఈసీజీలోనూ ఇలాగే ఉంటే మనం జీవించి లేమన్నట్టే".