1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (14:56 IST)

టాప్ 40 కోవిడ్ సేఫ్టీ దేశాల్లో భారత్‌కు దక్కని చోటు!

ప్రస్తుతం భారత్‌తో పాటు... ప్రపంచ దేశాలను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఈ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. దీంతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కుప్పకూలాయి. మరోవైపు, ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా టాప్-40 కోవిడ్-19 సేఫ్టీ దేశాల్లో భారత్‌కు చోటు దక్కలేదు. ఈ జాబితాను డీపీ నాలెడ్జ్ గ్రూపు విడుదల చేసింది. ఈ జాబితాలో ఇజ్రాయెల్ అగ్రస్థానం దక్కించుకోగా, ఆ తర్వాతి స్థానంలో జర్మనీ, దక్షిణకొరియా, ఆస్ట్రేలియా, చైనా ఉన్నాయి. 
 
ఇకపోతే, కరోనా ముప్పు అధికంగా ఉన్న దేశాల్లో భారత్‌కు మాత్రం 15వ స్థానం దక్కింది. అగ్రస్థానంలో ఇటలీ ఉంది. ఇటలీలో ఇప్పటివరకు 1.81 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 24,114 మరణాలు సంభవించాయి.
 
ఈ కరోనా ర్యాంకింగ్స్‌లో ఇటలీ తర్వాత అమెరికా, బ్రిటన్, స్పెయిన్, ఫ్రాన్స్ దేశాలు ఉన్నాయి. అమెరికాలో 7.99 లక్షలు కేసులు నమోదు కాగా, 42,897 మంది మరణించారు. బ్రిటన్, స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల్లోనూ కరోనా విలయం సృష్టిస్తోంది. భారత్ తర్వాత 16వ స్థానంలో శ్రీలంక, 17వ స్థానంలో ఇండోనేసియా దేశాలున్నాయి.