శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 19 మార్చి 2021 (14:02 IST)

‘మహా’ విజృంభణ - ఒక్కరోజులోనే అత్యధిక కేసులు - ముంబైలో లాక్డౌన్?

మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభణ మామూలుగా లేదు. రోజురోజుకు అక్కడ ఆందోళనకర స్థాయిలో నమోదవుతున్నాయి. ఫలితంగా ఆ రాష్ట్రంతోపాటు, భారత్‌లో కేసుల పెరుగుదలకు కారణమవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 25,833 కేసులు బయటపడ్డాయి. 
 
కరోనా వెలుగులోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా ఈ రాష్ట్రంలో 58 మంది మృత్యు ఒడికి చేరుకున్నారు. ఇక ఆర్థిక రాజధాని ముంబైలో గురువారం ఒక్క రోజే మూడు వేలకు చేరువగా కేసులు నమోదయ్యాయి. 
 
మహారాష్ట్రలో ఇంతకుముందు గత యేడాది సెప్టెంబరు నెల 11న అత్యధికంగా 24,886 కేసులు నమోదయ్యాయి. ఆ సంఖ్యను నేడు నమోదైన కొత్త కేసులు అధిగమించాయి. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన కేసుల సంఖ్య 24 లక్షలకు చేరింది. 53 వేల మందికిపైగా కరోనాతో మరణించారు.
 
ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల కేంద్ర బృందం మహారాష్ట్రలో పర్యటించిన అనంతరం కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఒక లేఖ రాశారు. 
 
కరోనా రెండో దశ రాష్ట్రంలో కొనసాగుతోందని ఈ బృందం హెచ్చరించింది. అవసరమైన చర్యలు తక్షణం చేపట్టాలని సూచించింది. ట్రాకింగ్‌, టెస్టింగ్‌ పద్ధతులను సమర్థవంతంగా నిర్వహించాలని పేర్కొంది.
 
కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి ముంబైలో లాక్‌డౌన్‌ విధిస్తారన్న వార్తలను ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ తోపే కొట్టిపారేశారు. కరోనా పరిస్థితిని కట్టడి చేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా సన్నద్ధమై ఉందని.. ముంబైలో లాక్డౌన్‌ అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.