గురువారం, 30 నవంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 నవంబరు 2021 (19:32 IST)

నోరో వైరస్ అంటే.. లక్షణాలివే..

corona
కేరళలో రిపోర్ట్ అయిన నోరో వైరస్ కేసులు ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఈ వైరస్ వేగంగా ఇతరులకు సోకే అవకాశం ఉన్నది. జీర్ణకోశానికి సోకే ఈ వ్యాధి వాంతులు, విరేచనాలు కలిగించి పేషెంట్‌ను డీహైడ్రేట్ చేసి మరిన్ని ఆరోగ్య సమస్యల బారిన పడేస్తుంది. 
 
నోరో వైరస్ అంటే..
నోరో వైరస్ మన దేహంలో జీర్ణ కోశాన్ని ప్రభావితం చేస్తుంది. జీర్ణ వ్యవస్థపై దాడి చేస్తుంది. ముఖ్యంగా జీర్ణాశయం.. దాని తర్వాత కొనసాగింపుగా ఉండే పేగులపై అటాక్ చేస్తుంది. అందుకే ఇది సోకగానే కడుపులో మంటగా ఉంటుంది. వాంతులు వచ్చేలా కడుపులో తిప్పినట్టూ అవుతుంది. సాధారణంగా ఇది ఆరోగ్యవంతులకు సోకదు. 
 
చాలా వరకు పిల్లలు, వయోధికుల్లోనే ఈ కేసులు ఎక్కువగా కనిపిస్తాయి. సాధారణంగా ఈ వైరస్ సోకిన తర్వాత రెండు రోజులపాటు తీవ్రత అధికంగా ఉంటుంది. తర్వాత తగ్గుముఖం పడుతుంది. 
 
కానీ, వాంతులు విరేచనాలూ ఈ సమయంలో ఎక్కువగా కావడం వల్ల సదరు పేషెంట్లు డీహైడ్రేట్‌కు లోనయ్యే ముప్పు ఉన్నది. తద్వార ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. కలుషిత ఆహారం, నీటిని తీసుకోవడం, నోరో వైరస్ సోకిన వారి నుంచి ఇతరులకు ఈ వైరస్
సోకుతుంది. జంతువుల నుంచీ నోరో వైరస్ సోకవచ్చు.
 
లక్షణాలివే..
నోరో వైరస్ సోకిన వారిలో వాంతులు, విరేచనలు కలుగుతాయి. పొట్ట నొప్పి, కడుపులో తిప్పినట్టు కావడం వంటివి లక్షణాలుగా కనిపిస్తాయి. తలనొప్పి, కాళ్లు, చేతుల నొప్పి.. అప్పుడప్పుడు ఒళ్లు నొప్పులూ వస్తాయి. కొందరిలో శరీర ఉష్ణోగ్రతలూ పెరుగుతాయి.
 
నివారణ మార్గాలు..
పరిశుభ్రంగా ఉండి నోరో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చు. ఆహారం తీసుకోవడానికి ముందు చేతులు శుభ్రంగా సబ్బు, నీటితో కడుక్కోవాలి. టాయిలెట్ యూజ్ చేసిన తర్వాత కూడా సబ్బుతో కాళ్లు, చేతులు శుభ్రం చేసుకోవాలి. ఆల్కహాల్ బేస్డ్ లిక్విడ్స్‌ కరోనా వైరస్‌ను చంపినట్టు నోరో వైరస్‌ను చంపలేవు. 
 
కాబట్టి సబ్బు నీటిని ఉపయోగించడమే ఉత్తమం. ఇంటి అవసరాలకు బ్లీచింగ్ పౌడర్‌తో క్లోరినేట్ చేసిన నీటిని వినియోగించుకోవాలి. ఎప్పటికప్పుడు ఉపరితలాలను శుభ్రం చేసుకోవాలి. వేడి చేసి చల్లార్చిన నీటినే తాగడానికి వినియోగించి ఈ వైరస్ నుంచి తప్పించుకోవచ్చు. 
 
నోరో వైరస్ సోకిన వారి నుంచీ ఇది నేరుగా సోకే అవకాశముంది. కాబట్టి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వారు ముట్టుకున్న వస్తువుల ఉపరితలాలపైనా వైరస్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి, అలాంటి చోట్లా జాగ్రత్తగా వ్యవహరంచాలి.