శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 మార్చి 2021 (11:12 IST)

చిన్నారుల కోసం కరోనా వ్యాక్సిన్.. ట్రయల్స్ యోచనలో ఫైజర్

కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రస్తుతం వ్యాక్సిన్లు అందుబాటులోకి  వచ్చాయి. అయితే ఇందులో చిన్నారులకు టీకాలు అందుబాటులో లేవు. ఈ క్రమంలో అమెరికా ఫార్మా దిగ్గజం కీలక ప్రకటన చేసింది. ఫైజర్‌ ఇంక్‌, జర్మనీకి చెందిన బయో ఎంటెక్‌తో కలిసి 12 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్న పిల్లల్లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ను ప్రారంభించినట్లు చెప్పింది. వచ్చే ఏడాది ప్రారంభం నాటికి టీకాలు అందుబాటులో తేవడమే తమ లక్ష్యమని పేర్కొంది. 
 
ట్రయల్స్‌లో భాగంగా బుధవారం వలంటీర్లకు మొదటి డోస్‌ ఇచ్చినట్లు ఫైజర్‌ ప్రతినిధి షరోన్‌ కాస్టిల్లో తెలిపారు. ఫైజర్‌, బయో ఎంటెక్‌ వ్యాక్సిన్‌కు యూఎస్‌ రెగ్యులేటరి అధికారులు డిసెంబర్‌ చివరలో 16 అంతకంటే ఎక్కువ వయస్సున్న వారిపై ప్రయోగాలకు అధికారం ఇచ్చారు.
 
యూఎస్‌ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్‌ సమాచారం ప్రకారం.. బుధవారం నాటికి అమెరికాలో దాదాపు 66 మిలియన్‌ మోతాదుల వ్యాక్సిన్‌ ఇవ్వబడింది. ఈ పిడియాట్రిక్‌ ట్రయల్‌ ఆరు నెలల వయస్సులోపు పిల్లలపై చేయనున్నారు. గతవారం మోడెర్నా ఇంక్‌ సైతం ఇదే తరహాలో ట్రయల్స్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం అమెరికాలో 16-17 సంవత్సరాల పిల్లలకు ఫైజర్‌ వ్యాక్సిన్‌ వేస్తున్నారు. 
 
మోడెర్నా టీకా 18 అంతకంటే ఎక్కువ వయస్సున వారికి మాత్రమే అనుమతి ఉండగా.. చిన్న పిల్లలకు వ్యాక్సిన్‌ వేసేందుకు అనుమతి ఇవ్వలేదు. ఫైజర్‌ రెండు షాట్ల వ్యాక్సిన్‌ను మూడు వేర్వేరు మోతాదుల్లో 10, 20, 30 మైక్రోగ్రాముల వద్ద 144 మంది చిన్నారులపై రెండు దశల ట్రయల్స్‌ యోచిస్తోంది.