ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. వైరస్ రెండో దశ విజృంభిస్తుందేమోనన్న భయం సర్వత్రా నెలకొంది. దీంతో వైరస్ వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిచింది. రాష్ట్రవ్యాప్తంగా నో మాస్క్.. నో ఎంట్రీ విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సూచనల మేరకు రాష్ట్రంలో 15 రోజులపాటు విస్తృత ప్రచారం చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.
ఈ క్యాంపెయిన్‌లో భాగంగా కరోనాతో పాటు వ్యాక్సినేషన్‌పై కూడా ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గురువారం మొదలయ్యే ఈ క్యాంపెయిన్ ఏప్రిల్ 7 వరకూ సాగుతుంది. ఈ నెల 24న జిల్లా కలెక్టర్లు అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి కార్యచరణను ప్రకటిస్తారు.
కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు క్షేత్రస్థాయిలో ఎంఆర్‌వోలు కూడా పాల్గొనాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 25న అవగాహన ర్యాలీలు నిర్వహిస్తారు. చివరగా ఏప్రిల్ 7న మండల కేంద్రాల్లో కరోనాకు వ్యతిరేకంగా క్యాండిల్ ర్యాలీలు నిర్వహించాలని ఆదేశించారు.
గట్టు తెంచుకున్న కరోనా
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ గట్టు తెంచుకున్నట్టుగా వుంది. గత కొన్ని రోజులుగా ఈ రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసులే ఇందుకు నిదర్శనం. తెలంగాణలో ఇప్పటికే పలు విద్యాసంస్థలు, వసతి గృహాల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది.
తాజాగా ఏపీలోనూ అదే స్థాయిలో కరోనా విజృంభణ కనిపిస్తోంది. రాజమండ్రిలోని ఓ కాలేజీలో ఏకంగా 163 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది. శనివారం ఈ కాలేజీలో 13 కేసులు రాగా, ఆదివారం 10 కేసులు వెలుగుచూశాయి. సోమవారం నాడు ఒక్కరోజే 140 పాజిటివ్ కేసులు రావడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
దీనిపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ గౌరీనాగేశ్వరరావు స్పందిస్తూ... 700 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు జరిపామని వెల్లడించారు. పాజిటివ్ విద్యార్థులను ఒకే ప్రదేశంలో ఉంచి, ఆ ప్రదేశాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించామని వివరించారు. కరోనా సోకని విద్యార్థులను మరో హాస్టల్ లో ఉంచినట్టు వివరించారు.
కాగా, తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాదులోని అనేక వసతిగృహాల్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. ఉస్మానియా వర్సిటీలో సైతం కరోనా ఉనికి వెల్లడైంది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు కరోనా బారినపడుతుండడంతో విద్యాసంస్థల కొనసాగింపుపై రేపు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో స్పష్టత ఇస్తారని తెలుస్తోంది.
కాగా, ఏపీలో గడచిన 24 గంటల్లో 35,375 కరోనా పరీక్షలు నిర్వహించగా 310 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 51 కేసులు వెల్లడి కాగా, తూర్పు గోదావరిలో 43, విశాఖ జిల్లాలో 43 కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు.
అదే సమయంలో 114 మంది కరోనా నుంచి కోలుకోగా, కృష్ణా జిల్లాలో ఒకరు, కర్నూలు జిల్లాలో మరొకరు మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 8,94,044 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,84,471 మంది కోలుకున్నారు. ఇంకా 2,382 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 7,191కి పెరిగింది.