మాస్క్ ధరించని వారిని ఓ పట్టుపట్టనున్న రెజ్లర్లు.. ఎక్కడ?

face mask
face mask
ఠాగూర్| Last Updated: సోమవారం, 15 మార్చి 2021 (15:35 IST)
ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. గత యేడాది నుంచి ప్రారంభమైన ఈ వైరస్ భయం ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. భారత్ వంటి పలు దేశాల్లో ఈ వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ఈ వైరస్ వ్యప్తి చెందకుండా పలు రకాలైన చర్యలను ప్రభుత్వాలు తీసుకుంటున్నప్పటికీ.. ప్రతి రోజూ కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య వేలల్లోనే ఉంది.

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనాపై పోరాడేందుకు రెజ్లర్లు రంగంలోకి దిగారు. ఎవరైనా మాస్కు పెట్టుకోకుండా కనిపిస్తే వారిని దొరకబుచ్చుకొని మరీ మాస్కులు తొడుగుతున్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. ఏడాది కాలంగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. దాని ధాటికి అనేక రంగాలు కుదేలైపోయాయి. ఎంతోమందికి ఉపాధి కరవైంది. దక్షిణ అమెరికాలోని మెక్సికోలో విశేష ప్రాచుర్యం పొందిన లూచా లిబ్రే రెజ్లింగ్‌ కూడా కొవిడ్‌ దెబ్బకు కుదేలైంది. కరోనాకు ముందు రెజ్లింగ్‌కు వేలమంది హాజరయ్యేవారు. కొవిడ్‌ కారణంగా రెజ్లింగ్‌ కార్యక్రమాలను నిలిపివేయడంతో రెజ్లర్లు ఉపాధి కోల్పోయారు.

మహమ్మారి అంతరించిపోతేనే తిరిగి తమకు ఉపాధి దొరుకుతుందని భావించిన రెజ్లర్లు కరోనాపై పోరుకు సిద్ధమయ్యారు. ప్రతిరోజు దాదాపు ఐదు లక్షల మంది వచ్చే అత్యంత ప్రసిద్ధి గాంచిన ‘డి అబాస్టో’ మార్కెట్‌కు ఎవరైనా మాస్కు ధరించకుండా వస్తే వారిని దొరకబుచ్చుకొని మరీ మాస్కు తొడుగుతున్నారు. రెజ్లింగ్‌ రింగ్‌లోకి దిగే దుస్తులు ధరించి, మాస్కులు పెట్టుకొని.. మాస్కు లేకుండా మార్కెట్‌కు వచ్చే కొనుగోలుదారులు, మార్కెట్లో ఉన్న అమ్మకందారులను మాస్కు ధరించాలని సూచిస్తున్నారు. సమాజం పట్ల బాధ్యత వహించాలని హెచ్చరిస్తున్నారు.

మెక్సికోలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే అక్కడ 2 లక్షల మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇంటినుంచి బయటకు వచ్చేవారు మాస్కులు ధరించకుండా వస్తున్నారని, వారంతా మార్కెట్లలో గుమిగూడి కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారని రెజ్లర్లు ఈ తరహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.దీనిపై మరింత చదవండి :