మాస్కులేకుండా విమానం ఎక్కించొద్దు ... డీజీసీఏ ఆదేశాలు
దేశలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కరోనా నిబంధలను క్రమంగా కఠినతరం చేస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో లాక్డౌన్ అమల్లోవుంది. అదేవిధంగా కర్నాటక రాష్ట్రంలోనూ లాక్డౌన్ విధించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో విమానయాన మంత్రిత్వ శాఖ కూడా కఠిన ఆంక్షలు విధించింది. మాస్క్ లేకుండా వచ్చే ప్రయాణికులను విమానం ఎక్కించవద్దంటూ ఆదేశాలు జారీచేసింది.
గత కొన్ని రోజులుగా దేశంలో ప్రతి రోజూ 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇది మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిబంధనలు మరింత కఠినతరం చేసింది. మాస్కు లేకుండా వచ్చే ప్రయాణికులను విమానం నుంచి దించేయాలని అన్ని విమానయాన సంస్థలను ఆదేశించింది. ఈ మేరకు నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది.
మాస్కు లేనివారిని ఎయిర్ పోర్టులోకి అనుమతించవద్దని సీఐఎస్ఎఫ్, పోలీసులకు తెలిపింది. విమానాశ్రయంలో ప్రయాణికులు మాస్కులు ధరించేలా చూడాల్సిన బాధ్యత విమానాశ్రయ డైరెక్టర్, టెర్మినల్ మేనేజర్ లదేనని స్పష్టం చేసింది. ప్రయాణికులు కరోనా ప్రోటోకాల్ ఉల్లంఘిస్తే వారిని భద్రతాసిబ్బందికి అప్పగించాలని డీజీసీఏ తన నూతన మార్గదర్శకాల జాబితాలో పేర్కొంది.
ప్రయాణ సమయంలో ఏ ప్రయాణికుడైనా పదేపదే కరోనా నిబంధనలు అతిక్రమిస్తుంటే ఆ వ్యక్తిని నిషేధిత జాబితాలో చేర్చాలని, ఆ విమానయాన సంస్థ ఆ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వివరించింది. విమానంలో ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా మాస్కు ఉండాల్సిందేనని, అది కూడా ముక్కును కవర్ చేసేలా మాస్కు ఉండాలని స్పష్టం చేసింది.