శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్

క్యాన్సర్ రోగులు కరోనా టీకా వేయించుకోవచ్చా?

కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ వైరస్ బారినపడి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది చనిపోయారు. కోట్లాది మంది ఈ వరస్ బారినపడ్డారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ రూపంలో ప్రపంచానికి కాస్త ఉపశమనం లభించింది. 
 
అయితే, ఈ టీకాను తొలుత వృద్ధులకు, కరోనాపై పోరులో ముందున్న యోధులకు, ఇతర దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో పోరాడుతున్న వారికి ఇచ్చారు. అయితే, వీరిలో చాలా మంది ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారే ఉంటారు. 
 
మరి కరోనా టీకాతో పాటు ఆయా జబ్బులకు కూడా ఔషధాలు తీసుకోవచ్చా? తీసుకుంటే టీకా పనిచేస్తుందా? ఏమైనా దుష్ప్రభావాలు తలెత్తుతాయా? అనే ప్రశ్నలు అనేక మంది మెదళ్లను తొలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైద్యులు చెప్పిన సలహాలు, సూచనలను పరిశీలిద్దాం..!
 
ముఖ్యంగా, క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స తీసుకోవడం ప్రారంభించని వారు టీకా తీసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. కానీ, కీమోథెరపీ వంటి చికిత్సలో ఉన్నవారు మాత్రం వ్యాక్సిన్‌ తీసుకోవద్దని సలహా ఇచ్చారు. ఈ విషయంలో వైద్యుల సలహాననుసరించాలన్నారు. అలాగే క్యాన్సర్‌ నుంచి కోలుకున్నవారు కూడా టీకా తీసుకోవచ్చని తెలిపారు. 
 
అదేవిధంగా అలర్జీలు, ఆస్తమాతో బాధపడుతున్నవారిలో కూడా టీకా వల్ల ఎలాంటి సమస్య తలెత్తడం లేదని గుర్తించినట్లు వైద్యనిపుణులు తెలిపారు. అయితే టీకా తయారీలో వినియోగించిన పదార్థాల వల్ల అంతకుముందే ఎవరికైనా అలర్జీలు తలెత్తిన చరిత్ర ఉంటే టీకా తీసుకోవద్దని సూచించారు.
 
హృద్రోగ సమస్యలతో బాధపడేవారు, గుండె పోటు, రెనల్ ఫెయిల్యూర్‌ (కిడ్నీ వైఫల్యం) వంటి సమస్యలు గతంలో తలెత్తి శస్త్రచికిత్స తీసుకున్నవారు సాధారణ ఔషధాలతో పాటే టీకా తీసుకోవచ్చని వైద్యులు తెలిపారు. కానీ, వ్యాక్సిన్‌ తీసుకోవడానికి వారం నుంచి పది రోజుల ముందు ఎవైనా తీవ్ర సమస్యలు ఏర్పడితే మాత్రం టీకా తీసుకోవడాన్ని వాయిదా వేస్తే మంచిదని వైద్యులు తెలిపారు.