మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 23 మార్చి 2021 (17:12 IST)

45 యేళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కరోనా టీకా : కేంద్రం

దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. దేశంలో కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ క్రమంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వీలైనంత వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సన్నద్ధమవుతోంది. 
 
ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ ఇస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. అర్హులైన వారు తమ వివరాలు నమోదు చేసుకుని వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. 
 
వ్యాక్సిన్ విషయంలో భయాందోళనలు అక్కర్లేదని స్పష్టం చేశారు. దేశంలో కరోనా వ్యాక్సిన్లకు కొరత లేదని జవదేకర్ వివరించారు.
 
మరోపక్క, దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటివరకు దేశంలో 4.85 కోట్ల మందికి వ్యాక్సిన్లు ఇచ్చామని తెలిపారు. రెండో విడతలో 80 లక్షల మంది వ్యాక్సిన్ పొందారని వివరించారు. 
 
గత 24 గంటల్లో 32.54 లక్షల మందికి వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్టు జవదేకర్ పేర్కొన్నారు. ఫిబ్రవరి మాసంలో సగటున రోజుకు 3.77 లక్షల మందికి వ్యాక్సిన్లు ఇచ్చామని చెప్పారు.
 
ఇదిలావుంటే, దేశంలో 24 గంట‌ల్లో 40,715 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ఉదయం విడుదల చేసింది. 
 
వాటి ప్రకారం... కొత్త‌గా 29,785 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,16,86,796కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 199 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,60,166కు పెరిగింది. 
 
దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,11,81,253 మంది కోలుకున్నారు. 3,45,377 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా 4,84,94,594 మందికి వ్యాక్సిన్లు వేశారు.
    
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 23,54,13,233 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 9,67,459 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.