మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 23 మార్చి 2021 (12:12 IST)

కాబోయే భార్య బయోపిక్ తీస్తానంటున్న హీరో విష్ణు విశాల్

తనకు కాబోయే భార్య జీవితం గురించి ఓ బయోపిక్ మూవీని తీస్తానని కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ ఏస్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, వివాదాస్పద గుత్తా జ్వాలా జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని బయోపిక్ మూవీని తెరకెక్కించనున్నట్టు తెలిపారు. 
 
కోలీవుడ్‌లో సక్సెస్‌ ఫుల్‌ హీరోగా రాణిస్తున్న ఈయన తాజాగా నటించిన చిత్రాల్లో "కాడన్‌" చిత్రం ఒకటి. పాన్‌ ఇండియాగా రూపొందిన ఈ చిత్రం ఈనెల 26వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నటుడు విష్ణు విశాల్‌ సోమవారం చెన్నైలో మీడియాతో ముచ్చటించారు. 
 
ఈ ఏడాది తాను నటించిన 4 చిత్రాలు వరుసగా విడుదల కానున్నాయని తెలిపారు. అందులో తాను సొంతంగా నిర్మించి, కథానాయకుడిగా నటిస్తున్న "ఎఫ్‌ఐఆర్", "మోహన్‌ దాస్‌" చిత్రాలు కూడా ఉన్నాయని చెప్పారు.
 
అదేవిధంగా త్వరలోనే ప్రముఖ బ్యాడ్మింటన్‌ గుత్తా జ్వాలాను పెళ్లాడబోతున్నట్లు తెలిపారు. ఇది ప్రేమ వివాహం కాదన్నారు. ఇంతకుముందు ప్రేమించి పెళ్లి చేసుకున్న వైవాహిక జీవితం చేదు అనుభవాన్నే మిగిల్చిందన్నారు. 
 
అందువల్ల తాను, జ్వాలా ఒకరికొకరం అర్థం చేసుకుని గౌరవించుకుని చేసుకుంటున్న పెళ్లి ఇది అని చెప్పారు. ఆమె తన గురించి పలు అనుభవాలను తనతో పంచుకున్నారని, ఆమె బయోపిక్‌ను చిత్రంగా నిర్మించాలని ఆలోచన తనకు ఉందన్నారు. 'కాడన్‌' చిత్రంలో నటించడం మంచి అనుభవాన్ని ఇచ్చిందని తెలిపారు.  ఈ చిత్ర దర్శకుడు ప్రభు సాల్మాన్‌తో కలిసి పని చేయడం సరికొత్తగా ఉందన్నారు.