ప్రియాంకా గాంధీ భర్తకు కరోనా పాజిటివ్
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు కరోనా వైరస్ సోకింది. ఆయనకు చేయించిన కరోనా నిర్దారణ పరీక్షల్లో కరోనా సోకినట్టు శుక్రవారం ఉదయం తేలింది. దీంతో ప్రియాంక గాంధీ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. అలాగే, ఆమె తమిళనాడులో చేపట్టాల్సిన అన్ని పర్యటనలు, ఎన్నికల ప్రచార సభలను రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె శుక్రవారం ట్విట్టర్‌లో వెల్లడించారు.
తన భర్తకు పాజిటివ్ రావడంతో తాను కూడా టెస్ట్ చేయించుకున్నానని, నెగెటివ్ వచ్చిందని ఆమె చెప్పారు. నాకేమీ కరోనా సోకలేదు. రిపోర్టులో నెగెటివ్ వచ్చింది. కానీ, వైద్యుల సలహా మేరకు స్వీయ నిర్బంధంలో (సెల్ఫ్ ఐసోలేషన్) ఉన్నాను. కలిగిన అంతరాయానికి చింతిస్తున్నాను అని ఆమె ట్వీట్ చేశారు. దీంతో కేరళ, తమిళనాడుల్లో నిర్వహించదలచిన ఎన్నికల ప్రచార సభలను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు.
కాగా, అంతకుముందు తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు రాబర్ట్ వాద్రా ఫేస్‌బుక్‌లో వెల్లడించారు. దురదృష్టవశాత్తూ ఎవరో కొవిడ్ పేషెంట్‌తో కాంటాక్ట్ అయి ఉంటానని, దీంతో తనకూ పాజిటివ్ వచ్చిందని అన్నారు. కొవిడ్ మార్గదర్శకాల ప్రకారం తాను, కరోనా నెగెటివ్ వచ్చినా ప్రియాంక స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయామని వెల్లడించారు.