గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 29 మే 2020 (19:05 IST)

కన్నతల్లికి కరోనా వచ్చిందన్న అనుమానంతో ఇంట్లోకి రానివ్వని కొడుకులు

మానవత్వం కోల్పోయారు ఇద్దరు కొడుకులు. కన్నతల్లి అన్న మాటనే మరిచి కర్కశంగా ప్రవర్తించారు. కని పెంచిన తల్లిని కరోనా భయంతో ఇంటి నుంచి గెంటేవేశారు. లాక్ డౌన్‌తో మహారాష్ట్రలో చిక్కుకుపోయిన తల్లి తిరిగి ఇంటికి వస్తే కరోనా ఉందంటూ ఇంట్లోకి రానివ్వకుండా రోడ్డుపై వదిలేసిన ఘటన కరీంనగర్‌లో చోటుచేసుకుంది.
 
వృద్ధాప్యములో ఉన్న ఆ తల్లి ఎక్కడికి వెళ్లాలో తెలియక రోడ్డు పైనే కూర్చుని భోరున విలపిస్తుంది. ఆ అమ్మపేరు శ్యామల. వయసు 70 ఏళ్ళు. ఈమెకు ఇద్దరు కొడుకులు. ఆర్థికంగా కాస్త బలంగా ఉన్నావారే. వృద్ధ తల్లి లాక్‌డౌన్‌కి ముందు మహారాష్ట్ర లోని షోలాపూర్లో తన దగ్గరి బంధువుల ఇంట్లో ఓ ఫంక్షన్‌కి వెళ్ళింది. ఆ ఫంక్షన్ ముగుంచుకుని వద్దామనుకునేలోపు లాక్‌డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయింది.
 
ఇన్ని రోజులు ఏదోలా అక్కడే బంధువుల ఇంట్లో కాలం గడిపింది. ప్రభుత్వం ఇచ్చిన లాక్ డౌన్ సడలింపుల కారణంగా అతి కష్టం మీద హైదరాబాద్‌కు చేరుకొని అక్కడి నుండి బస్సులో కరీంనగర్ చేరుకుంది వృద్ధురాలు. 
కరీంనగర్‌కు వచ్చిన తరువాత కిసాన్ నగర్ ప్రాంతంలో ఉన్న తన కొడుకుల ఇంటికి యథావిధిగా వెళ్ళింది. అయితే నీకు కరోనా ఉంటుంది. ఇంట్లోకి రావద్దు, నీ వల్ల మా అందరికీ కరోనా అంటుకుంటుంది అంటూ ఆ తల్లిని ఇంట్లోకి రానివ్వలేదు.
 
దీంతో కన్న కొడుకులే అంత మాట అనడంతో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మండుటెండలో రోడ్డు మీద కూర్చింది. ఇక కొడుకులకు ఏమైందో అనుకుంటే ఇద్దరు కోడళ్ల కూడా అదే బాటలో ఉన్నారు. మహారాష్ట్రలో కరోనా ఉంది నీకు కూడా వచ్చి ఉంటుంది వెళ్ళు ఇంట్లోకి రావొద్దు అంటూ బయటకి పంపించేశారు. ఇకవేళ కరోనా ఉన్నా కరోనా లక్షణాలు ఉన్నా ఆసుపత్రికి వెళ్లి చూపించాలి కానీ ఇలా చిత్రహింసలకు గురి చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
తనకు జ్వరం, దగ్గు ఎలాంటివి లేవని ఇంటి నుండి గెంటి వేస్తే ఎక్కడ బతకాలని కంట నీరు పెట్టుకుంది ఆ తల్లి. స్థానికులు కొడుకులను వారించడంతో రోడ్డున ఉన్న కన్నతల్లిని ఇంట్లోకి రానిచ్చారు. ఈ ఘటన చూసిన జనాలు అంతా ముక్కున వేలేసుకున్నారు.