కరోనాను జయించిన 36 రోజుల పసికందు.. ఎక్కడ?
వృద్ధులు, పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని.. అందుకే కరోనా వైరస్ నుంచి తప్పించుకోవాలంటే.. చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు అంటున్నారు. అయినా పిల్లలో ఎక్కువగా ఈ వైరస్ బారిన పడుతున్నారు. వీరిని బతికించడం కోసం వైద్యులు రాత్రింబవళ్లు కృషి చేస్తున్నారు.
తాజాగా కరోనా వైరస్ బారిన పడిన 36 రోజుల పసికందు మృత్యుంజయుడుగా నిలిచాడు. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరోనా కేసులు మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.
ఈ క్రమంలో ముంబైలోని 36 రోజుల బాలుడికి కరోనా సోకింది. దీంతో తల్లిదండ్రులు సియాన్ పిల్లల ఆసుపత్రిలో చేరిపించారు. అక్కడి వైద్యులు నిబంధనల ప్రకారం ప్రత్యేకంగా చికిత్స అందించారు. దాదాపు 15 రోజుల పాటు చికిత్స అందించారు. అనంతరం పరీక్షలు నిర్వహించారు. ఇందులో నెగటివ్ రిపోర్టు వచ్చింది. పూర్తిగా కోలుకున్న తర్వాత.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
36 రోజుల పసికందు కరోనాను జయించడంతో తల్లిదండ్రులతో పాటు అందరూ సంతోషం వ్యక్తం చేశారు. తల్లి బాలుడిని ఎత్తుకుని ఆసుపత్రికి బయటకు వస్తున్న వీడియోను మహారాష్ట్ర సీఎం కార్యాలయం ట్విట్టర్ వేదిక ద్వారా ట్వీట్ చేసింది. వైద్యులు, నర్సులు, ఇతర మెడికల్ సిబ్బంది అంతా చప్పట్లతో వీడ్కోలు పలికారు.