శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 16 జూన్ 2020 (12:42 IST)

కరోనా కేసుల్లో తెలంగాణ రికార్డు : లాక్డౌన్ వార్తలు ఖండించిన సీఎస్

తెలంగాణ రాష్ట్రం కరోనా కేసుల్లో రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు మొత్తం 5193 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో లాక్డౌన్ అమలు చేయబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమశ్ కుమార్ స్పందించారు. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని హితవు పలికారు. 
 
మరోవైపు, గ్రేటర్‌ హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తోంది. తెలంగాణలో అత్యధిక కేసులు ఇక్కడే నమోదవుతున్నాయి. వైరస్‌ కట్టడికి ప్రభుత్వం విస్తృత చర్యలు తీసుకుంది. హైదరాబాద్‌ పరిసరాల్లో 50 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
 
ఈ మేరకు మంగళవారం నుంచి గ్రేటర్‌ హైదరాబాద్‌లో కరోనా పరీక్షలు చేయడానికి ఏర్పాట్లు పూర్తిచేసింది. ఎంపిక చేసిన వనస్థలిపురం, బాలాపూర్‌, కొండాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. 
 
గతంలో పాజిటివ్‌ వచ్చిన వారి కుటుంబ సభ్యులు, కాంటాక్ట్‌ అయిన వారికి ఇక్కడ మొదటగా పరీక్షలు నిర్వహించనున్నారు. ఒక్కో కేంద్రంలో రోజుకు 150 మందికి పరీక్షలు నిర్వహించనున్నారు. 
 
మొదటి దఫాలో ఎంపిక చేసిన కేంద్రాల్లో ప్రారంభించిన ప్రభుత్వం మరికొన్ని రోజుల్లో వీటిని పెంచే యోచనలో ఉంది. త్వరలో ఫీవర్‌, కింగ్‌కోఠి, చెస్ట్‌, సరోజినీ ఆస్పత్రుల్లో కూడా ఈ అవకాశం అందుబాటులోకి వచ్చే అెకాశముంది.
 
అలాగే, దేశంలో కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. కేంద్ర వైద్యశాఖ అధికారులు వెల్లడించిన వివరాల మేరకు, గడచిన 24 గంటల్లో 10,667 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇదేసమయంలో 10,215 మంది రికవర్ కాగా, 380 మంది మరణించారు. 
 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,53,178 యాక్టివ్ కేసులుండగా, 1,80,013 మంది రికవర్ అయ్యారని, 9,900 మంది మరణించారని అధికారులు గణాంకాలను విడుదల చేశారు. దీంతో ఇప్పటివరకూ దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,43,091కి చేరుకున్నట్లయింది.