ధోనీ కెప్టెన్ కావడం అతి పెద్ద పొరపాటు.. ఎందుకంటే? (video)
బీజేపీ నేతలకు నోటి దురుసు ఎక్కువనే టాక్ వుంది. ఈ జాబితాలో ప్రస్తుతం టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కూడా చేరినట్లు తెలుస్తోంది. భారత క్రికెట్ దిగ్గజాలపై సంచలన కామెంట్లు చేసేందుకు వెనుకాడని గంభీర్.. ప్రస్తుతం టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై విమర్శలు గుప్పించాడు.
గతంలో తాను టీమిండియాలో స్థానం కోల్పోవడానికి ధోనీయే కారణమంటూ అనేకసార్లు ధ్వజమెత్తిన గంభీర్ ఈసారి ధోనీపై పాజిటివ్‌గా స్పందించడం విశేషం. మహేంద్ర సింగ్ ధోనీ టీమిండియా కెప్టెన్ కావడం అతి పెద్ద పొరపాటు అంటూ ముక్తాయించిన గంభీర్ తన ఉద్దేశమేమిటో వెంటనే వివరించాడు.
టీమిండియా సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోని పేరు చెప్పగానే దేశవిదేశ ఆటగాళ్లు, అభిమానులు అందరూ మెచ్చుకునేది అతడి నాయకత్వ లక్షణాలను. ప్రత్యర్థి వ్యూహాలను చేధిస్తూ.. క్లిష్ట సమయాలలో కూల్‌గా నిర్ణయాలను తీసుకుని టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. అయితే ఎంఎస్ ధోని కెప్టెన్ కావడంతో క్రికెట్ ప్రపంచం ఓ గొప్ప బ్యాట్స్‌మన్‌ను చూసే అవకాశం కోల్పోయిందని గౌతమ్ గంభీర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ధోని కెప్టెన్ కావడంతో క్రికెట్ ప్రపంచం ఓ అద్భుత బ్యాట్స్‌మన్‌ను కోల్పోయిందన్నాడు. అతను భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న తర్వాత మూడో స్థానంలో బ్యాటింగ్ చేయలేదు. మూడో స్థానంలో బ్యాటింగ్ చేసుంటే ధోనిలోని ఓ భిన్నమైన ఆటగాడిని క్రికెట్ ప్రపంచం చూసేదని వ్యాఖ్యానించాడు.