బుధవారం, 13 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 మే 2020 (14:16 IST)

ధోనీ రిటైర్మెంట్.. లాక్‌డౌన్‌ ప్రజలను పిచ్చోళ్లుగా మార్చిందన్న సాక్షి

టీమిండియా మాజీ కెప్టెన్ ధోని రిటైర్మెంట్‌పై మళ్లీ చర్చ మొదలైంది. బుధవారం ధోని రిటైర్మెంట్‌ తీసుకున్నాడనే వార్త సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేసింది. అంతేకాకుండా #DhoniRetires అనే హ్యాష్‌ ట్యాగ్‌ కూడా ట్విటర్‌లో తెగ ట్రెండ్‌ అయింది. దీంతో అతడి అభిమానులు గందరగోళానికి గురయ్యారు. దీనిపై స్పందించిన ధోనీ సతీమణి సాక్షి సింగ్ రావత్ కొట్టిపారేసింది. 
 
ఈ క్రమంలో ధోని రిటైర్మెంట్‌పై సాక్షి చేసిన ట్వీట్‌ వివాదస్పదమైంది. ''అవన్నీ పుకార్లు. లాక్‌డౌన్‌ ప్రజలను పిచ్చోళ్లుగా మార్చిందని నేను అర్థం చేసుకున్నాను'' అంటూ ట్వీట్‌ చేశారు. దీనిపై పలువురు అభ్యంతరం తెలపడంతో వెంటనే ఆ ట్వీట్‌ను సాక్షి తొలగించారు. అయితే అప్పటికే ఆ ట్వీట్‌ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అయింది. గతంలో ధోని రిటైర్మెంట్‌పై సాక్షి కూల్‌గానే సమాధానమిచ్చారని, తరుచూ ఇలాంటి వార్తలు వస్తుండటంతో పూర్తిగా సహనం కోల్పోయి కోపంలో అలా ట్వీట్‌ చేశారని ధోని కుటుంబ సన్నిహితులు అంటున్నారు. 
 
కాగా ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌-2019 అనంతరం ధోని ఇప్పటివరకు టీమిండియా జెర్సీ ధరించలేదు. దీంతో అప్పటినుంచి ఈ జార్ఖండ్‌ డైనమెట్‌ రిటైర్మెంట్‌పై చర్చ ప్రారంభమైంది. ఐపీఎల్‌లో అతడి ప్రదర్శన ఆధారంగా తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉందని అందరూ భావించారు. కానీ కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ టోర్నీ వాయిదా పడుతూ వస్తోంది. దీంతో ధోనీ రిటైర్మెంట్ తీసుకుంటాడని చర్చ మొదలైంది.