మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 అక్టోబరు 2020 (21:07 IST)

తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని కాటేసిన కరోనా - బ్రహ్మోత్సవాలు జరిగేనా? (Video)

తిరుమల తిరుపతి దేవస్థాన్ ఛైర్మన్ వైవీ సబ్బారెడ్డికి కరోనా వైరస్ సోకింది. ఇది తిరుమల గిరుల్లో కలకలం రేపుతోంది. తాజాగా నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో, ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి కరోనాకు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుబ్బారెడ్డిని ముఖ్యమంత్రి జగన్ టీటీడీ ఛైర్మన్‌గా నియమించారు.
 
కాగా, కోట్లాది మంది భక్తులు అత్యంత భక్తితో కొలుచుకునే తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయం కూడా కరోనా వల్ల మూతపడిన సంగతి తెలిసిందే. అయితే అన్లాక్ ప్రక్రియలో భాగంగా తిరుమల ఆలయం మళ్లీ తెరుచుకుంది. ఆ తర్వాత ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ... ఆలయ అర్చకులు, జీయర్లు, టీటీడీ అధికారులు కూడా కరోనా బారిన పడ్డారు. ఒకరిద్దరు అయ్యంగార్లు ఈ కరోనా వైరస్ దెబ్బకు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇపుడు తితిదే ఛైర్మన్ హోదాలో ఉన్న సుబ్బారెడ్డి కరోనా వైరస్ బారినపడటం కలకలం రేపుతోంది. 
 
కాగా, ఈ నెల 16వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. వీటిని తితిదే ఛైర్మన్ దగ్గరుండి స్వయంగా పర్యవేక్షించారు. పైగా, తితిదే ఈవోగా నియమితులై కేఎస్ జవహర్ రెడ్డి గత శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కూడా సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఇపుడు ఈయనకు కరోనా వైరస్ సోకడంతో ఆయనతో కాంటాక్ట్ అయిన వారందరూ సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లాల్సివుంది. ఇది శ్రీవారి బ్రహ్మోత్సవాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.