శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Modified: శనివారం, 3 జులై 2021 (17:24 IST)

ఇక గర్భిణీలకు టీకా, అనుమతించిన కేంద్ర ప్రభుత్వం

గర్భిణీలకు కూడా కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా వ్యాక్సిన్‌ కోసం వారు కొవిన్‌ యాప్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపింది. వీటితోపాటు సమీప కేంద్రాలకు నేరుగా వెళ్లి టీకా వేయించుకోవచ్చని వెల్లడించింది.
 
ఇప్పటివరకు కేవలం చంటిపిల్లల తల్లులకు మాత్రమే టీకా ఇచ్చేందుకు అనుమతించిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా గర్భిణీలకు కూడా ఇవ్వాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది.
 
దేశవ్యాప్తంగా 18ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్‌ ఇచ్చే కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. కానీ, గర్భిణీ స్త్రీలపై విస్తృత ప్రయోగాల వివరాలు లేకపోవడంతో వీటిపై నిర్ణయం తీసుకోలేదు.
 
ఇదే సమయంలో వైరస్‌ బారినపడుతున్న గర్భిణీ స్త్రీల సంఖ్య పెరగడం.. రానున్న రోజుల్లోనూ థర్డ్‌వేవ్‌ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ ఈ విషయంపై మరోసారి చర్చించింది.
 
ఇందులో భాగంగా గర్భిణీలకు కూడా వ్యాక్సిన్‌ ఇవ్వవచ్చని నేషనల్‌ టెక్నికల్‌ అడ్వయిజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌ (NTAGI) ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఇందుకు సంబంధించి కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది.
 
కరోనా ముప్పు అందరికీ పొంచివున్న నేపథ్యంలో గర్భిణీలకు టీకా ఎంతో ముఖ్యమని.. తప్పకుండా వారికి అందించాల్సిందేనని ఐసీఎంఆర్‌ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే, వ్యాక్సిన్‌ ఇచ్చే ముందు వాటి వల్ల కలిగే దుష్ర్పభావాలను వారికి వివరించాల్సి ఉందన్నారు.