బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 21 జూన్ 2021 (05:40 IST)

కోవిడ్ వ్యాక్సినేషన్‌లో ఎపి కొత్త రికార్డు

కోవిడ్ నియంత్రణ చర్యల్లో జాతీయస్థాయిలో అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ మరోసారి వ్యాక్సినేషన్‌లో తన సామర్థ్యంను చాటుకుంది. వ్యాక్సినేషన్ లో ఈరోజు కొత్త రికార్డు సృష్టించింది. గతంలో ఒకేరోజు 6 లక్షల మందికి వ్యాక్సిన్‌లు ఇచ్చిన ప్రభుత్వం ఈరోజు తన రికార్డును తానే అధిగమించింది.

ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 13 లక్షల మందికి వ్యాక్సిన్ అందించారు. ఉదయం నుంచి ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా ప్రజలకు చేరువ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాల్లో ఏర్పాటు చేసిన 2232 కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఒక ప్రత్యేక డ్రైవ్‌ గా నిర్వహించారు.

రాష్ట్రంలో కోట్లాది మందికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముమ్మరం చేయాల్సిన పరిస్థితుల్లో సీఎం వైయస్ జగన్ ముందుస్తుగానే వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందికి అవసరమైన శిక్షణను ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం నేడు సత్ఫలితాలను ఇస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేసి, ప్రజలకు వ్యాక్సిన్‌ను అందించాలన్న సీఎం ఆదేశాలను వైద్య, ఆరోగ్యశాఖ కార్యరూపంలోకి తీసుకువచ్చింది.

దీనికితోడు క్షేత్రస్థాయిలో పనిచేసే ఆశావర్కర్లు, ఎఎన్‌ఎంలకు వ్యాక్సినేషన్‌లో అవసరమైన శిక్షణను అందించడం, ప్రతి యాబై ఇళ్లకు నియమించిన వాలంటీర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమంపై అవగాహన కల్పించడం వల్ల ఒకేరోజు లక్షలాధి మందికి వ్యాక్సిన్‌ను అందించే సామర్థ్యంను ఎపి సొంతం చేసుకుంది.

గతంలో ఒకేరోజు ఆరు లక్షల మందికి వ్యాక్సిన్ అందించి వైద్య, ఆరోగ్యరంగంలో తమ సంసిద్దతతను పరీక్షించుకుంది. నేడు దానిని కూడా అధిగమించి దాదాపు పదమూడు లక్షల మందికి వ్యాక్సినేషన్ చేయడం జాతీయ స్థాయిలోనే కొత్త రికార్డును సృష్టించింది. 
 
పటిష్టమైన సప్లై-చైన్ నెట్‌వర్క్‌
వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రతి జిల్లాలకు వ్యాక్సిన్‌ అత్యంత తక్కువ సమయంలోనే రవాణా అవుతోంది.

కేంద్రం నుంచి వస్తున్న వ్యాక్సిన్‌ను గన్నవనం విమానాశ్రయం సమీపంలోని సెంట్రల్ వ్యాక్సిన్ స్టోరేజీ సెంటర్‌కు తరలించడం, అక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి జిల్లాకు ఎటువంటి జాప్యం లేకుండా వారికి కేటాయించిన డోసులను తరలించేందుకు పటిష్టమైన నెట్‌వర్క్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

గన్నవరం సెంటర్‌ నుంచి ఆయా జిల్లాలకు వ్యాక్సిన్ చేరుకున్న వెంటనే, జిల్లా వ్యాప్తంగా ఉన్న వ్యాక్సినేషన్ కేంద్రాలకు వాటిని పంపిణీ చేయడం, మరోవైపు వ్యాక్సిన్ వేసేందుకు ఆయా కేంద్రాల్లో ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేసుకోవడం వల్ల ప్రజలు ఎక్కువ సేపు కూడా వ్యాక్సిన్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఒక ప్రణాళికాబద్దంగా వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నారు.

ఏ కేంద్రంలో వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నారో ముందుస్తుగానే వాలంటీర్ల ద్వారా ప్రజలకు తెలియచేస్తుండటంతో, ప్రజలకు  చేరువగానే ఏర్పాటు చేసే శిబిరాల్లో వ్యాక్సిన్ అందించడం ప్రారంభిస్తున్నారు.