రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజుల్లో మొత్తం 15 ఆస్పత్రులను తనిఖీ చేసి 9 ఆస్పత్రులు అవకతవకలకు పాల్పడట్లు నిర్ధారించి సంబంధిత యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్ కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
కోవిడ్ చికిత్సలో అవకతవకలకు పాల్పడుతున్న ఆస్పత్రులపై ఏర్పాటు చేసిన ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు మంగళ, బుధవారాల్లోనూ తనిఖీలు నిర్వహించినట్లు, మొత్తంగా ఇప్పటివరకు మొత్తం 37 ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు.
ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రభుత్వం నిర్ధేశించిన రేట్ల కంటే అధిక మొత్తం వసూలు చేయడం, రెమిడిసివిర్ ఇంజక్షన్లు దుర్వినియోగం చేయడం, బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు అమ్మడం, ప్రభుత్వం అనుమతి లేకుండా కరోనా చికిత్స నిర్వహించడం, ఆరోగ్యశ్రీ పథకానికి అర్హులైన రోగులకు కరోనా చికిత్సను తిరస్కరిస్తున్నట్లు తమ తనిఖీల్లో గుర్తించడం జరిగిందన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఉన్న చైత్ర హాస్పిటల్ అధికంగా ఛార్జీలు వసూలు చేయడంతో పాటు పేషెంట్లు వారికి సంబంధించిన చికిత్సపై తప్పుడు సమాచారం అందించినట్లు గుర్తించి ఐపీసీ సెక్షన్లు 188, 420 తో పాటు డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ లోని సెక్షన్ 53 క్రింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.
అనంతపురంలోని ఆశా హాస్పిటల్ నందు ప్రభుత్వం నిర్ధేశించిన ధరల కంటే అధికంగా ఛార్జీలు వసూలు చేయడం గుర్తించి ఐపీసీ సెక్షన్ 188, 420, 406 తో పాటు డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్డులోని సెక్షన్లు 51(ఏ), 53 క్రింద కేసులు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.
విశాఖపట్టణం జిల్లా గోపాలపట్టణం ఎస్.ఆర్ హాస్పిటల్ నందు ప్రభుత్వం నిర్ధేశించిన ధరల కంటే అధికంగా ఛార్జీలు వసూలు చేయడం మరియు రెమిడిసివిర్ ఇంజక్షన్లను దుర్వినియోగం చేయడం గుర్తించి ఐపీసీ సెక్షన్ 188, 420తో పాటు డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ లోని సెక్షన్లు 51(బి), 53 క్రింద కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.
విశాఖపట్టణం జిల్లా అనిల్ నీరుకొండ(ఎన్ఆర్ఐ భీమిలి) హాస్పిటల్ నందు ప్రభుత్వం నిర్ధేశించిన ధరల కంటే అధికంగా ఛార్జీలు వసూలు చేయడం గుర్తించి ఐపీసీ సెక్షన్ 420 క్రింద కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
విశాఖపట్టణంలోని రమ్య హాస్పిటల్ లో అనుమతి లేకుండా కోవిడ్ చికిత్సలు నిర్వహిస్తున్నందుకు మరియు రెమిడిసివిర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్ చేస్తున్నట్లు గుర్తించి ఐపీసీ సెక్షన్ 188, 420తో పాటు డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ లోని సెక్షన్లు 51(బి) క్రింద కేసులు నమోదైనట్లు వివరించారు.
విజయవాడలోని అచ్యుత ఎన్‌క్లేవ్‌లో అనుమతి లేకుండా ప్రైవేట్ ప్రాంగణంలో కోవిడ్ చికిత్సలు అందిస్తున్నట్లు గుర్తించి ఐపీసీ సెక్షన్ 188, 420, 269 క్రింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
విజయవాడలోని శ్రీరామ్ హాస్పిటల్ నందు అనుమతి లేకుండా కోవిడ్ చికిత్సలు నిర్వహిస్తున్నందుకు, ప్రభుత్వం నిర్ధేశించిన ధరల కంటే అధికంగా ఛార్జీలు వసూలు చేయడం, రోగులనే స్వంతంగా రెమిడిసివిర్ ఇంజక్షన్లను తెచ్చుకోమని చెబుతున్నట్లు గుర్తించి ఐపీసీ సెక్షన్ 188, 420, 269 తో పాటు డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 51(బి) క్రింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
గుంటూరులోని విశ్వాస్ హాస్పిటల్ నందు ప్రభుత్వం నిర్ధేశించిన ధరల కంటే అధికంగా ఛార్జీలు వసూలు చేయడం, ఆరోగ్యశ్రీ క్రింద చికిత్సలను తిరస్కరిస్తున్నట్లు గుర్తించి ఐపీసీ సెక్షన్ 188, 420, 384లతో పాటు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ సెక్షన్ 51(బి) క్రింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
చిత్తూరు జిల్లా పీలేరులోని డాక్టర్ ప్రసాద్ హాస్పిటల్ నందు ప్రభుత్వం నిర్ధేశించిన ధరల కంటే అధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు గుర్తించి 188, 420 సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసినట్లు రాజేంద్రనాథ్ రెడ్డి వివరించారు.