శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 మే 2021 (13:11 IST)

కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఇలా చేయండి.. లేదంటే...

చాలా మంది కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఇక తమకు కరోనా సోకదులే అనే భ్రమలో ఉంటూ ఇష్టానుసారంగా తిరుగుతుంటారు. అశ్రద్ధవహిస్తారు. ఇలాంటి వారికి వైద్యులు ఓ హెచ్చరిక చేస్తున్నారు. కరోనా సోకినవారు ఇకపై మనకు కరోనా రాదని అశ్రద్ధ చేస్తే మాత్రం ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందేంటూ హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా, కరోనా నుంచి కోలుకున్న చేయాల్సిన పనులను వైద్యులు వెల్లడించారు.
 
వైరస్‌ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ మనతో పాటు చుట్టూ ఉన్న వారు దాని బారినపడకుండా చూసుకోవాలి. ఈ క్రమంలో మన చుట్టూ ఉన్న ప్రతి చిన్న విషయాలపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. 
 
ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్ఫెక్షన్‌ నుంచి కోలుకున్న వారంతా మొదట తమ టూత్‌ బ్రష్‌ను మార్చాలని సలహా ఇస్తున్నారు. దంతాలు శుభ్రం చేసుకునేందుకు పాత బ్రష్‌ను వినియోగించడం తిరిగి వైరస్‌ సోకే ప్రమాదాన్ని పెంచుతుందని పేర్కొంటున్నారు.
 
దేశంలో చాలా మంది సాధారణ వాష్‌ రూములను వినియోగిస్తున్నారని.. కరోనా నుంచి కోలుకున్న అనంతరం పాత బ్రష్‌లను వినియోగించడం ద్వారా వారితో పాటు కుటుంబ సభ్యులకు సైతం హాని కలిగిస్తాయని దంత వైద్య నిపుణులు చెబుతున్నారు.
 
కరోనా లక్షణాలు వచ్చిన 20 రోజుల తర్వాత అందరు టూత్ బ్రష్, టంగ్‌ క్లీనర్‌ మార్చాలి. నోటిలో ఉన్న వైరస్‌, బ్యాక్టీరియాను తొలగించేందుకు వెచ్చని నీటిలో కొంత ఉప్పు వేసి గార్లింగ్‌ చేయాలని సూచించారు. ఇది నోటిలో ఉన్న ఇన్ఫెక్షన్లను బయటకు పంపేందుకు ఉత్తమమ మార్గమని తెలిపారు. 
 
అలాగే అనేక రకాలైన మౌత్‌ వాష్‌లు, బెటాడిన్‌ గార్లింగ్‌ లిక్విడ్‌ అందుబాటులో ఉన్నాయని, వాటిని సైతం వినియోగించుకోవచ్చని సూచిస్తున్నారు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నపక్షంలో కరోనా వైరస్‌కు దూరంగా ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు.