సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 సెప్టెంబరు 2022 (23:31 IST)

ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్ : పాకిస్థాన్ చేతిలో ఓడిన భారత్

ind vs pak
ఆసియా కప్ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. తద్వారా ప్రత్యర్థి ఆటగాళ్ల ముంగిట నిర్ధేశించిన 182 పరుగుల విజయలక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి మరో బంతి మిగిలివుండగానే పాకిస్థాన్ జట్టు గెలుపొందింది. 
 
ఆ జట్టులో ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్ 51 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 71 పరుగులు, మరో ఓపెనర్, కెప్టెన్ బాబర్ అజమ్ 10 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 14 పరుగులు చేసింది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లలో ఖక్తర్ జమాన్ 18 బంతులు ఎదుర్కొని 2 ఫోర్ల సాయంతో 15 పరుగులు చేయగా, మహ్మద్ నవాజ్ 20 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేశాడు. అసిఫ్ అలీ 16, ఖుష్‌దిల్ షా 14 (నాటౌట్), అహ్మద్ 2 (నాటౌట్) చొప్పున పరుగులు చేసి జట్టును గెలిపించారు. భారత బౌలర్లలో భువనేశ్వర్, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్, హార్ధిక్ పాండ్యా, చాహల్‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 
 
అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టులో ఓపెనర్లు రోహిత్ శర్మ 28 (20 బంతులు 1 ఫోరు, 6 సిక్సర్లు), కేఎల్ రాహుల్ 28 (16 బంతులు 3 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 4 ఫోర్లు ఓ సిక్సర్ సాయంతో 60 పరుగులు, సూర్య కుమార్ యాదవ్ 10 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 13, రిషభ్ పంత్ 12 బంతుల్లో 14 రన్స్, దీపక్ హుడా 14 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 16 రన్స్, రవి బిష్ణోయ్ 2 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 8 చొప్పున పరుగులు చేశారు. 
 
లీగ్ మ్యాచ్‌లో పాక్‌పై చెలరేగిన హార్దిక్ పాండ్యా 2 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. పాక్ బౌలర్లలో షదాబ్ ఖాన్ 2, నసీం షా, హుస్నైన్, రౌఫ్, నవాజ్‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. విరాట్ కోహ్లీ వికెట్‌ను రనౌట్ రూపంలో పడగొట్టారు. 
 
ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో స్వల్ప మార్పులుచేసింది భారత తుది జట్టుకు ఎంపిక చేసినవారిలో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్, దీపక్ హూడా, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, యజువేంద్ర చాహల్‌లు ఉన్నారు. 
 
అలాగే, పాకిస్థాన్ జట్టులో మహ్మద్ రిజ్వాన్, బాబర్ అజమ్, ఫక్తర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్‌దిల్ షా, అసిఫ్ అలీ, మహ్మద్ నవాజ్, హరీస్ రౌఫ్, మహ్మద్ హోస్నైన్, నజీం షాలకు తుది జట్టులో చోటు కల్పించారు.