సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (10:28 IST)

సమిష్టి కృషివల్లే కెప్టెన్‌గా సక్సెస్ : విరాట్ కోహ్లీ

జట్టు సభ్యుల సమిష్టి కృషి వల్లే తాను కెప్టెన్‌గా సక్సెస్ సాధిస్తున్నట్టు భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా... ఆతిథ్య కరేబియన్ జట్టుతో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ముఖ్యంగా జమైకా వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ సేన 257 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. ఫలితంగా టెస్ట్ సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. 
 
అంతేగాకుండా విండీస్‌తో జరిగిన రెండో టెస్టులో గెలుపుతో కోహ్లి అత్యధిక విజయాలు సాధించిన టీమిండియా టెస్టు కెప్టెన్‌గా కొత్త చరిత్ర సృష్టించాడు. దీనిపై కోహ్లీ స్పదంిస్తూ, 'విజయవంతమైన టెస్ట్‌ కెప్టెన్‌గా ఉండటం ఆనందంగా ఉంది. అయితే ఇదంతా జట్టు సమిష్టి కృషి వల్లే సాధ్యమైంది. మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా షమీ, ఇషాంత్‌, జడేజా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ముప్పు తిప్పలు పెట్టారు. నిజానికి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి మన పేరుకు ముందు 'సి' అనే కొత్త అక్షరం చేరుతుందే గానీ పెద్దగా మార్పు ఏమీ ఉండదు. జట్టు రాణించకపోతే కెప్టెన్‌ ఒక్కడే విజయాలు సాధించలేడు కదా. మరిన్ని విజయాలు సాధించడమే మా ముందున్న లక్ష్యం' అని చెప్పుకొచ్చారు. 
 
అలాగే, రెండో టెస్ట్ మ్యాచ్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచిన తెలుగు యువ క్రికెటర్‌ హనుమ విహారిపై కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. 'ఈ మ్యాచ్‌లో హనుమ విహారీ స్టాండ్‌ అవుట్‌ బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు. తను అంకితభావం గల ఆటగాడు. ఈరోజు టాప్‌ క్లాస్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. తను క్రీజులో ఉన్నపుడు డ్రెస్సింగ్‌లో అంతా నిశ్శబ్దంగా ఉండి తన ఆటపై దృష్టి సారిస్తారు. తను సహజంగానే మనసు పెట్టి ఆడతాడు. జట్టు విజయం కోసం పరితపిస్తాడు. తనకు ఎంతో భవిష్యత్తు ఉంది. జట్టులోకి ఎంపిక చేసిన నిర్ణయానికి ఈరోజు తన ఆటతో సమాధానం చెప్పాడు' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. 
 
ఇదిలావుండగా, విండీస్‌ను మట్టి కరిపించిన కోహ్లీ సేన కరేబియన్‌ దీవుల్లో తొలిసారి టెస్ట్‌ సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన ఘనత సాధించింది. అదేవిధంగా ఐసీసీ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో 120 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. భారత బౌలర్లు మహ్మద్‌ షమి, జడేజా మూడేసి వికెట్లు తీసి తీయగా.. ఇషాంత్‌ శర్మకు రెండు, బుమ్రాకు ఒక వికెట్‌ దక్కింది. కాగా రోహిత్‌ శర్మను కాదని హనుమ విహారిని ఎంచుకున్న కోహ్లి నిర్ణయానికి సమర్థింపుగా.. సెంచరీ, అర్థసెంచరీతో విహారీ సత్తా చాటాడు. దీంతో మ్యాన్ ఆప్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు.