మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 26 జులై 2015 (15:10 IST)

క్రికెట్‌ కోసమే పుట్టా... దేవుడు నాపై దయ చూపాడు : శ్రీశాంత్

నేను క్రికెట్ కోసమే పుట్టా.. దేవుడు నాపై దయ చూపాడు. అందుకే ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు నుంచి నేను మచ్చలేని క్రికెటర్‌గా బయటపడినట్టు ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ శ్రీశాంత్ అన్నాడు. భారత క్రికెట్‌ను కుదిపేసిన ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ బెట్టింగ్‌ కుంభకోణంలో ఢిల్లీ కోర్టు శనివారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులుగా పేర్కొన్న రాజస్థాన్‌ రాయల్స్‌ క్రికెటర్లు శ్రీశాంత్‌, అజిత్‌ చండీలా, అంకిత్‌ చవాన్‌లతో పాటు.. మొత్తం 16 మంది నిర్దోషులుగా బయటపడ్డారు. 
 
ఈ తీర్పుపై శ్రీశాంత్ స్పందిస్తూ ఈ క్షణంలో ఎంతో ఆనందంగా ఉన్నా. దేవుడు నాపై దయ చూపాడు. అన్ని విషయాల్లో బీసీసీఐ మద్దతుగా నిలిచింది. భారత్‌కు ఆడాలన్నది నా కల. త్వరలోనే మళ్లీ ప్రాక్టీస్‌ ప్రారంభిస్తా. బీసీసీఐ సౌకర్యాలను ఉపయోగించుకొనేందుకు బోర్డు అనుమతిస్తుందని భావిస్తున్నా. ఫిట్‌నెస్‌ సాధించి సెలెక్టర్ల ముందుకొస్తా. నాకిప్పుడు 32 ఏళ్లు. మరికొన్ని సంవత్సరాలు ఆడగలను. కష్టకాలంలో నాకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు. కేసులో చిక్కుకున్నప్పటి నుంచి ఈ రోజు కోసం ఎదురుచూస్తున్నా. కొంత ఆలస్యమైనా మంచి తీర్పే వెలువడింది. నాకు ఎవరిపైనా కోపం లేదు. ఎవరిపైనా ఆరోపణలు చేయదలుచుకోలేదు. అన్నీ వదిలేసి మళ్లీ క్రికెట్‌ ఆడాలని అనుకుంటున్నా. నేను క్రికెట్‌ కోసమే పుట్టా. సినిమా అవకాశాలు వస్తున్నా, ఆటకే నా ఓటు. మైదానంలోకి వెళ్లి పరుగు తీయాలని ఆతృతగా ఉన్నా అని ఉద్విగ్నభరితంగా చెప్పుకొచ్చాడు.