శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 27 ఏప్రియల్ 2024 (14:10 IST)

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

Anil Katz, Chandra Bose  Suchitra, Chandra Bose
Anil Katz, Chandra Bose Suchitra, Chandra Bose
విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా 'శబరి'. మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. మహర్షి కూండ్ల చిత్ర సమర్పకులు. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న సినిమా విడుదల అవుతోంది. ఆల్రెడీ విడుదల చేసిన 'నా చెయ్యి పట్టుకోవే...' పాటకు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. ఇప్పుడు 'అనగనగా ఒక కథలా...' పాటను ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ విడుదల చేశారు.
 
'అనగనగా ఒక కథలా...' పాటకు సుచిత్రా చంద్రబోస్ నృత్య రీతులు సమకూర్చారు. తన సతీమణి కొరియోగ్రఫీ చేసిన పాటను చంద్రబోస్ తన చేతుల మీదుగా విడుదల చేయడం ఇదే తొలిసారి.
 
పాటను విడుదల చేసిన తర్వాత చంద్రబోస్ మాట్లాడుతూ... ''ఇప్పుడే నేను 'శబరి' సినిమాలోని 'అనగనగా ఒక కథలా...' పాటను విడుదల చేశా. గోపీసుందర్ గారి సంగీతంలో రెహమాన్ గారు రాశారు. ఈ పాట చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఈ సాంగ్ విడుదల కంటే ముందు నేను విన్నాను. నా భార్య సుచిత్ర కొరియోగ్రఫీ చేయడం కోసం ఇంటికి సాంగ్ తీసుకు వచ్చింది. సాంగ్ విని సాహిత్యం చదువుతానని తీసుకున్నా. చదువుతుంటే నాకు చాలా చాలా సంతోషం కలిగింది. ఈ పాట ఎవరు రాశారు? కథ ఏమిటి? అని ఫోన్ చేసి మాట్లాడాను. చాలా మంచి బాణీకి అంతే అందమైన భావాలతో కూడిన సాహిత్యం రాశారు. నా చేతుల మీదుగా విడుదల చేయించారని మంచిగా చెప్పడం కాదు... పాట విడుదలకు ముందే విని ఎంతో నచ్చే నిర్మాతను, గేయ రచయితను అభినందించా. ఈ పాట తప్పకుండా ఘన విజయం సాధిస్తుంది. చిత్ర గారు ఈ పాటకు తన గాత్రంతో జీవం పోశారు. తల్లి ప్రేమలోని మాధుర్యాన్ని ప్రతి పదంలో చూపించారు. తల్లి కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించాలి. నిర్మాత మహేంద్రనాథ్ గారితో పాటు చిత్ర బృందం అందరికీ పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా'' అని చెప్పారు.
 
సుచిత్రా చంద్రబోస్ మాట్లాడుతూ... ''నేను కొరియోగ్రఫీ అందించిన పాటను మా ఆయన ఇదే తొలిసారి. చాలా సంతోషంగా ఉంది. 'శబరి' సినిమాలో చక్కటి సందర్భంలో వచ్చే గీతమిది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మహేంద్రనాథ్ గారికి థాంక్స్'' అని‌ చెప్పారు.
 
'అనగనగా ఒక కథలా...' పాట విడుదలైన సందర్భంగా నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ ''తల్లి ప్రేమ నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో మా 'శబరి' ప్రత్యేకంగా నిలుస్తుంది. కన్న బిడ్డను కాపాడుకోవడం కోసం ఓ తల్లి ఎంత దూరం వెళుతుందనేది చెప్పే చిత్రమిది. బరువైన భావోద్వేగాలతో కూడిన సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా. ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇస్తుంది. వరలక్ష్మి గారి నటన ఈ సినిమాకు హైలైట్ అవుతుంది. తల్లీ కూతుళ్లు సరదాగా విహారయాత్రకు వెళ్లే పాట 'నా చెయ్యి పట్టుకోవే'కు అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పుడీ 'అనగనగా ఓ కథలా...' విడుదల చేశాం. రెండు పాటలకు రెహమాన్ గారు అద్భుతమైన సాహిత్యం అందించారు. చిత్ర గారు మా సినిమాలో ఈ 'అనగనగా ఒక కథలా...' పాట పాడటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. సుచిత్రా చంద్రబోస్ గారు ఎంతో సీనియర్. నంది అవార్డ్స్ విన్నర్. నేను కొత్త నిర్మాత అయినా సరే... ఎంతో అంకిత భావంతో సాంగ్ కొరియోగ్రఫీ చేశారు. ఆవిడ డెడికేషన్ చూసి ఆశ్చర్యపోయా. గోపీసుందర్ గారు పాటలే కాదు, నేపథ్య సంగీతం కూడా సూపర్బ్ చేశారు. మే 3న ప్రేక్షకులకు థియేటర్లలో 'శబరి' థ్రిల్లింగ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది'' అని చెప్పారు.
 
'శబరి' చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. ఆయన స్వరపరిచిన బాణీకి 'అనగనగా ఒక కథలా...' అంటూ రెహమాన్ సాహిత్యం అందించగా... లెజెండరీ సింగర్ కెఎస్ చిత్ర ఆలపించారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాటను విడుదల చేశారు.